మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు… కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. వరుసగా వస్తున్న విమర్శల్ని తట్టుకోవడానికి మాత్రం తంటాలు పడుతోంది. రోజంతా.. వైసీపీ నేతల్ని.. మంత్రుల్ని… చివరికి.. తన సొంత మీడియాలో పని చేసి..సలహాదారులుగా తెచ్చిపెట్టుకున్న పేరుగొప్ప జర్నలిస్టుల్ని కూడా.. మీడియా ముందుకు తీసుకొచ్చింది. అందరితోనూ.. ఒకటే చెప్పించింది. తమ జీవో చట్ట విరుద్ధమేమీ కాదనే వాదన వినిపిచింది. వైసీపీ సర్కార్‌ది ముక్కుపచ్చలారని ప్రభుత్వమని..ఆ ప్రభుత్వంపై నిరాధారకథనాలు రాసి.. చితికిపోయేలా చేస్తున్నారని.. అందుకే.. ఈ జీవో తీసుకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారు.
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని… ఓ రూల్ బుక్ లాంటి మాటలను.. తన ప్రెస్మీట్లో వివరించారు. అయితే.. అన్నీ తమ మీదకు రాకుండా.. కేంద్రంపై వచ్చేలా చూసుకున్నారు. పత్రికల్లో ఏం రాయాలో, ఏం రాయకూడదో.. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం నడుచుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. టీవీ ఛానల్, పేపర్‌కు లైసెన్సులు ఇచ్చేది కేంద్రమేనని … ఆర్టికల్ 19(ఏ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విఘాతం కలిగించదని చెప్పుకొచ్చారు. మా వ్యక్తిత్వాన్ని హరిస్తుంటే మేం మాట్లాడకూడదంటే ఎలా అని ఎదురు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కంటే మేమే ఎక్కువ అన్నట్లు.. పత్రికల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని..మండిపడ్డారు. భారతదేశంలో మీడియాలు వేరు ఏపీలో వేరని సూత్రీకరించారు. కొడాలి నాని కూడా అదే చెప్పుకొచ్చారు.
ఇటీవలే ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన … సాక్షి మాజీ ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి కూడా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సమర్థించారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు అవాస్తవాలు రాయడం సరికాదని … ఆధారాలు లేని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనక ఎలాంటి దురుద్దేశం లేదని సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. వాస్తవాలు రాసేవారు భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. ఆయన ఎడిటోరియల్ డైరక్టర్ గా ఉన్నప్పుడు.. సాక్షిలో వచ్చిన కథనాలన్నీ..ఆధారాలతో రాశారా..అనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. మొత్తానికి దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి ఏపీ సర్కార్… అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది.