దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి… అధికారంలోకి వచ్చిన వెంటనే..ఆ దిశగా.. జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారు. మద్యం షాపుల్ని ఇరవై శాతం మేర తగ్గించి… మద్యం అమ్మే సమయాల్ని కూడా.. మార్చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఇక ప్రైవేటు వ్యక్తులెవరూ.. మద్యం అమ్మరు. దుకాణాలన్నీ… ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇందు కోసం ప్రత్యేకంగా కొంత మంది ఉద్యోగుల్ని నియమించుకున్నారు. దీంతో ఈ రోజు నుంచి ఏపీలో మద్యనిషేధం వైపు తొలి అడుగు పడినట్లయింది.
పర్మిట్‌రూములు, బెల్ట్ షాపుల్లేని ఆంధ్ర…!
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం విషయంలో కొత్త ఉదయం ఆవిష్కృతమయింది. ప్రైవేటు వ్యక్తులు ఎవరికీ మద్యం అమ్మే లైసెన్స్ లేదు. దాంతో… గతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే బెల్ట్ షాపులు కనుమరుగు కావడం ఖాయం. గతంలో మద్యం దుకాణాల వారీగా.. లక్ష్యాలను నిర్దేశించేవారు. వాటిని అందుకోవడానికి.. బెల్ట్ షాపులు పెట్టుకునేందుకు దుకాణ యజమానులకు అవకాశం ఇచ్చేవారు. వాటిని ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లుగా ఉండేవారు. దాంతో మద్యం దుకాణం ఇళ్ల మధ్యకు చేరిపోయినట్లయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు కూడా.. ఇక ఉండవు. పక్కన కొంత ప్లేస్ ఇచ్చి.. అక్కడ నిలబడి మద్యం తగి వెళ్లిపోయేలా.. పర్మిట్ రూములకు గతంలో పర్మిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేదు.
ఎనీ టైం మద్యం ఇక ఏపీలో దొరకదు..! పేదవాళ్లు కొనలేరు..!
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను మద్యం రోడ్డున పడేస్తోంది. వారు కొనలేనంతగా ధరలు పెంచుతానని.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనే ప్రకటించారు. ముందస్తుగా… తొలి విడతలో.. దాదాపుగా ఇరవై శాతం ధరలు పెంచేశారు. ప్రత్యేక రీటైల్ ట్యాక్ విధించారు.. రూ. వందకు వచ్చే మద్యాన్ని రూ. 120 వరకూ తీసుకెళ్లారు. ఇది ప్రజలకు భారమే. సాధారణ, మధ్య, పేద తరగతి … మద్యం ప్రియులు.. ఇక.. మద్యాన్ని మానుకోవడం తప్ప మరో దారి ఉండకపోవచ్చు. దీని వల్ల మద్యం అమ్మకాలు తగ్గుతాయి కానీ… ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు. ఈ ప్రయత్నం ఉభయతారకం అని చెప్పుకోవచ్చు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే.. మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు.
అక్రమ మద్యాన్ని నియంత్రిస్తేనే ఫలితం..! ఇసుకలా చేస్తే ఫెయిల్యూరే..!
ప్రభుత్వ దుకాణాలు కాబట్టి.. ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు ఉండవు. కానీ.. పరిస్థితి మరో రకంగా ఉండే అవకాశం ఉంది. అక్రమ మద్యం పెద్ద ఎత్తున గ్రామాలను.. ముంచెత్తడం ఖాయమనే అంచనా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రాదు కానీ.. అక్రమార్కులకు మాత్రం వరంగా మారుతుంది. పన్నులు కట్టని మద్యం.. ఏపీలో వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అదీ పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. పైగా ధర చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలోనే అక్రమార్కులు రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇసుక విధానంలో అలాంటి పరిస్థితినే చూస్తున్నాం. ఇసుకను సాధారణ ప్రజలకు అందనీయడం లేదు కానీ… బ్లాక్ మార్కెటర్లకు మాత్రం కావాల్సినంత దొరుకుతోంది. ఈ తరహాలో.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కన్నా.. బ్లాక్‌లోనే మద్యం తక్కువకు దొరుకుతోందన్నట్లుగా పరిస్థితులు మారితే.. ప్రభుత్వం పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. ఈ విషయంలో సొంత పార్టీ నేతల్ని.. వైసీపీ అధినేత కమ్ సీఎం పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే… మద్యనిషేదం వైపు తొలి అడుగు సక్సెస్‌ఫుల్‌గా పడినట్లవుతుంది.