లాక్డౌన్ పేరుతో రెండు నెలల పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు కోత వేసిన జీతాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెండు నెలల్లో చెల్లించాల్సిన పరిస్థితిని ఏపీ సర్కార్ తెచ్చుకుంది. 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని.. వాటిని కొట్టి వేయాలని.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. కానీ.. రెండు నెలలు మాత్రమే గడవు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఎందుకంటే.. ఏపీ సర్కార్.. కత్తిరించిన ఉద్యోగుల జీతాలను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. ఈ నెల నుంచే ఐదు వాయిదాల చెల్లింపులు ప్రారంభిస్తామని గతంలో చెప్పారు కానీ.. అలాంటి సూచనలేమీ లేవు.
అలాగని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా పాటించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి కోరి తెచ్చుకున్న ఉత్తర్వులతో… రెండు నెలల్లో ఉద్యోగులు పెన్షనర్ల వద్ద కత్తిరించిన దాదారు రూ. ఆరు వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే.. హైకోర్టు చెప్పినట్లుగా మళ్లీ పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పొందగలిగినంత రుణం పొందిన ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్ల మీద బండి నడిపిస్తోంది. నెలాఖరుకు వచ్చే సరికి.. జీతాల కోసం ఎక్కడైనా అప్పులు దొరుకుతాయేమోనని.. ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండు నెలల్లో.. ఆరేడువేల కోట్లు తెచ్చి .. ఉద్యోగులకు చెల్లించడం కష్టమే. కేసుల భయం.. చూపి ఉద్యోగులను నోరెత్తకుండా చేస్తున్నారు.
సామాజిక బాధ్యత కారణంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ఏది చెబితే అది దానికి ఓకే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఐదు ఈఎంఐలకు ఓకే అని కూడా అన్నారు. ఇప్పుడు పనిమాలా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి .. రెండు నెలల్లో చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఒక వేళ రెండు నెలల్లో చెల్లించకపోతే.. పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. అది మరింత భారం మాత్రమే కాదు.. పరువు తక్కువ కూడా. కానీ.. చేసుకున్నవాడికి చేసుకున్నంత..!