ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలనుకుంటే క్షణం కూడా ఆగదు. అటూ ఇటూ కూడా ఆలోచించదు. ఉన్న పళంగా జీవో జారీ చేసేస్తుంది. అది చెల్లుతుందా.. లేదా అన్నది తర్వాత సంగతి. రోజంతా సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయం ఘటనలో…ఎవరిపై కక్ష తీర్చుకోవాలా అని ఆలోచించి.. చివరికి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే.. ఆయన రామతీర్థం ఆలయానికి అనువంశిక ధర్మకర్త. మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఆయనను తొలగించిన తర్వాత… ఆయనకు .. ఆయన కుటుంబం వేల ఎకరాలు ఇచ్చిన ఆలయాలపైన వారికి పెత్తనం లేకుండా చేశారు. అలాంటి సందర్భంలో.. ఏ ఆలయాలకు తాను ధర్మకర్తగా ఉన్నారో అశోక్ గజపతిరాజుకు కూడా తెలియని పరిస్థితి.
అయినప్పటికీ.. ఆయన రామతీర్థం ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారని.. ఆయనను తొలగిస్తున్నామని జీవో ఇచ్చేసింది. ఈ జీవోను చూసి.. టీడీపీ నేతలు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కళ్లు మూసుకుపోయి జీవోలు ఇస్తోందని అంటున్నారు. నిజానికి ధర్మకర్త.. ధర్మకర్తే. ఆయనకు ఎలాంటి విధులు.. ఉండవు. కానీ.. ధర్మకర్తగా ఉండి.. ఆయన ఆలయ నిర్వహణను పట్టించుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. అందుకే తొలగించామని చెబుతోంది.
ధర్మకర్తను బాధ్యుడిని చేసే ముందు.. ఆలయానికి సంబంధించిన అధికారులందర్నీ బాధ్యుల్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు.. కక్షతో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు.. రామతీర్థం ఆలయ బాధ్యలు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒకటి చేసేయాలన్న కక్షతో.. ప్రభుత్వం ఉంటే ఇలాంటి జీవోలే బయటకు వస్తాయన్న చర్చ మాత్రం సాగుతోంది.