ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాల్లో ఎవరైనా సంపాదించే వ్యక్తి చనిపోతే.. అలాంటి కుటుంబానికి ప్రభుత్వమే నేరుగా రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వైఎస్సార్ బీమా పథకంపై చేసిన సమీక్షలో… పథకంలో భాగంగా ఎవరికీ పెద్దగా లబ్ది చేకూరడం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. బీమా సంస్థలు క్లెయిమ్‌లు ఇవ్వడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయించారు. కుటుంబంలో 18-70 ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే 5 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలుగుదేశం హయాంలో చంద్రన్న బీమా పేరుతో ప్రవేశ పెట్టిన పథకం క్లిక్ అయింది. ప్రభుత్వం నేరుగా ఎల్ఐసీకి ప్రజల తరపున బీమా చెల్లిస్తుంది. దాదాపుగా 90 శాతం మంది ప్రజలకు బీమా కవర్ అయింది. ఎవరైనా చనిపోతే.. అదే రోజు.. అంత్యక్రియ కోసం 5వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లో మిగతా మొత్తం అకౌంట్లో జమ చేసేవారు. సంపాదించే వ్యక్తి చనిపోతే ఐదు లక్షల వరకూ వచ్చేవి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న బీమాను రద్దు చేశారు. వైఎస్ఆర్ బీమాను ప్రవేశ పెట్టారు. కానీ.. రెండేళ్లలో బీమా ప్రీమియమే అంతంతమాత్రం కట్టారు. క్లెయిమ్స్ రావడం లేదు. దీంతో వైసీపీ సర్కార్‌కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కరోనా కష్ట కాలంలో… ఎక్కువ మంది చనిపోవడం.. ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో.. గతంలో వచ్చిన చంద్రన్న బీమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వ వ్యూహం మార్చింది.
బీమా సంస్థలకు సరిగ్గా ప్రీమియం చెల్లించకపోవడం… ఇతర కారణాల వల్ల క్లెయిమ్‌లు ఉండటం లేదు. నేరుగా ప్రభుత్వం ఇవ్వడం అంటే.. చాలా క్లిష్టతరమైన విషయం. ప్రకటన చేయడం వరకూ బాగానే ఉంటుంది కానీ.. అమలు చేయడమే కీలకం. ప్రస్తుత కరోనా కాలంలో.. చంద్రన్న బీమా లేదా వైఎస్ఆర్ బీమా ఉండి ఉన్నట్లయితే.. కొన్ని వేల కుటుంబాలు… ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేవి. వచ్చే నెల మొదటి నుంచి ప్రభుత్వమే అమలు చేస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన మరణాల క్లెయిమ్‌లను ఇప్పించాల్సి ఉంది. లేకపోతే.. ప్రజలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.