ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… కనిపించిన ప్రతీదానికి వైసీపీ రంగులు వేయడమే కాదు… ప్రతీ పథకానికి వైఎస్ఆర్ పేరు పెడుతోంది. ఈ క్రమంలో… ఈ పథకానికి పెట్టిన పేరు.. అత్యంత వివాదాస్పదమయింది. అప్పటి వరకూ ఉన్న పేరును తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టడంతో.. ఏపీలో ఒక్క సారిగా గగ్గోలు రేగింది. ఇంత స్పందన వస్తుందని.. తెలియని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా.. వెంటనే.. ” సీరియస్ అయ్యాను.. తక్షణం… నాయన పేరు తీసేసి.. మళ్లీ పాత పేరు పెట్టండి..” అని ఆదేశాలు జారీ చేసుకోవాల్సి వచ్చింది. వింత నిర్ణయాలతో వివాదాస్పదంగా సాగుతున్న పాలనలో.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై.. అందరూ జాలిపడేలా.. ప్రస్తుతం.. ఈ వ్యవహారం.. చర్చనీయాంశం అవుతోంది.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా అవార్డులను ప్రారంభించారు. విద్యార్థులందరికీ స్ఫూర్తి కలిగేలా… వీటికి భారతరత్న అబ్దుల్ కలాం పేరు పెట్టారు. రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డులు ప్రధానం చేస్తూ వస్తున్నారు. అయితే… టీడీపీ సర్కార్ ప్రవేశ పెట్టింది కాబట్టి.. ఈ అబ్దుల్ కలాం.. అనే పేరు టీడీపీ నేతది అయి ఉంటుందని అనుకున్నారో.. లేక… వైసీపీ సర్కార్ ఇప్పుడు అవార్డులు ఇస్తోంది కాబట్టి.. వైఎస్ఆర్ పేరు ఉండాల్సిందేనని…తీర్మానించుకున్నారో కానీ.. ఉన్న పళంగా… అబ్దుల్ కలాం పేరు తీసేసి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి పెట్టేశారు. జీవో ఇలా బయటకు రావడం ఆలస్యం.. అందరూ ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను అవమానిస్తున్నారంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా అభిమానించే అబ్దుల్ కలాం పేరును తొలగించడం దారుణం అంటూ విద్యావేత్తలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష నేతలు ఎందుకు ఊరుకుంటారు..? చంద్రబాబు, లోకేష్ కూడా.. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. అబ్దుల్ కలాంను అగౌరవ పరుస్తున్నారని.. తక్షణం .. ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్య జనాల నుంచి ఈ ఫీడ్ బ్యాక్ నేరుగా జగన్ కే తెలిసినట్లుంది.. వెంటనే రియాక్టయ్యారు. తనకు తెలియకుండానే… పథకం పేరు మారిందనే అర్థం వచ్చేలా.. ఆయన అధికారులపై సీరియస్ అయ్యారంటూ… మళ్లీ పథకానికి వైఎస్ఆర్ పేరు తీసేసి.. అబ్దుల్ కలాం పేరు పెడుతున్నాంటూ.. ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అని… ఇతరులు సర్కార్ పై సెటైర్లేస్తున్నారు.