జగన్ రెడ్డి వికృత మనస్థత్వానికి ఐదేళ్ల సర్వీస్ కోల్పోయి రిటైర్మెంట్ చివరి రోజున పోస్టింగ్ లో చేరి వెంటనే రిటైరైపోయిన ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేసింది. ఆయనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులు అని నిర్దారించి ఇప్పటికే వాటిని ఉపసంహరించుకుంది. ఆయనపై సస్పెన్షన్ కాలంలో పెండింగ్ లో ఉన్న జీత భత్యాలన్నీ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
జగన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి కారణం అప్పట్లో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావేనని అనుమానంతో .. తాము అధికారంలోకి రాగానే ఆయనపై కక్షసాధింపులు ప్రారంభించారు. మొదట్లో ఆరు నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత రాత్రికి రాత్రి తప్పుడు అభియోగాలు మోపి సస్పెండ్ చేశారు. కోర్టుల్లో ఎక్కడా ఆధారాలు చూపించలేదు. దాంతో కోర్టులు ఆయనపై సస్పెన్షన్ అక్రమం అని తేల్చాయి. జీతభత్యాలన్నీ చెల్లించాలని ఆదేశించాయి. కానీ ప్రభుత్వం కాలయాపన చేసింది. చివరికి ఆయనను నిరూపణ కాని వ్యవహారంలో డిస్మిస్ చేయాలని కూడా సిఫారసు చేశారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సస్పెన్షన్ కాలంలో పెండింగ్ లో ఉన్న జీత భత్యాలన్నీ ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు జీత భత్యాలు విడుదల చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై నాడు తోటి ఐపీఎస్‌లే కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ఫోర్జరీ చేశారని ఏబీవీ ఆరోపించారు. కూటమి గెలవగానే.. ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న గౌతం సవాంగ్ రాజీనామా చేసి కనిపించకుండా పోయారు.