ఎన్నికలు వద్దే వద్దని పట్టుబట్టిన ఏపీ సర్కార్ ఇప్పుడు అనూహ్యమైన టర్న్ తీసుకుంది. ఆగిపోయిన పరిషత్, మున్సిపల్ ఎన్నికల విషయంలో తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికలు నిర్వహించాలని లిఖితపూర్వకంగా ఎస్ఈసీకి తెలిపింది. నిజానికి పంచాయతీ ఎన్నికలు ముగియగానే… ఆగిపోయిన పరిషత్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎలాగూ ఆయన నిర్వహించడం ఖాయం కాబట్టి… తామే అంగీకారం తెలిపుతూ లేఖ రాస్తే… కాస్త ఎన్నికలకు భయపడటం లేదన్న సంకేతాలను పంపినట్లుగా ఉంటుందని అనుకున్నారేమో కానీ అంగీకారం తెలుపుతూ లేఖ రాశారు. ఇప్పుడు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పరిషత్, మున్సిపల్ ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసే సమయానికి నామినేషన్లు పూర్తయ్యాయి. పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ వాయిదా వేసిన తర్వాత ఏకగ్రీవాల విషయంలో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.అదే సమయంలో… రాజకీయ పార్టీలన్నీ… పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తగా మళ్లీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో అదే అభిప్రాయం వ్యక్తం అయింది. ఆ సమావేశానికి వైసీపీ హాజరు కాకపోవడంతో.. ఆ పార్టీ వాదన రికార్డు కాలేదు. ఇప్పుడు… ఎన్నికలను మొదటి నుంచి నిర్వహిస్తే.. ఇబ్బంది అవుతుందని ఎక్కడ ఆపేశారో.. అక్కడే ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అయితే ఈ అంశంపై ఎస్ఈసీ న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
వారి సలహాలను బట్టి… ఏకగ్రీవాలను రద్దు చేయాలా.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే.. ఎక్కడ ఆగిపోయినవి అక్కడి నుంచే కొనసాగించాలా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. మరోసారి ఎస్ఈసీపై వైసీపీ నేతలు విరుచుకుపడే అవకాశం ఉంది.