ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో పాత పద్దతికి వెళ్లిపోతోంది. మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వచ్చిన మొదట్లో రాత్రి ఎనిమిది గంటలకు కొట్టు కట్టేసేవారు. తర్వాత తొమ్మిది గంటలకు మార్చారు. ఇప్పుడు మళ్లీ పది గంటలకు మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆతర్వాత ఖాతాల నిర్వహణ కోసం మరో గంట తెరిచి ఉంచవచ్చని కూడాచెప్పారు. అంటే ఆ సమయంలోనూ మద్యం కోసం ఎవరైనా వస్తే అమ్ముతారన్నమాట . లేదంటే పది గంటలకు మూసేయవచ్చు.
మద్యం నిషేధం పేరుతో హడావుడి చేసి.. ఏడాదికి ఇరవై శాతం దుకాణాలు తగ్గిస్తామంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో అదొక్కడే ఆదాయమార్గంగా కనిపిస్తోంది. ధరలుతగ్గించి.. ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరగకుండా … సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంటోంది. పాపులర్ బ్రాండ్లు దొరక్క మేడిన్ ఆంధ్రా మద్యం బ్రాండ్లతో గొంతు తడుపుకుంటున్నవారికి కొత్త ఏడాదిలో షాక్ ఇస్తూ.. పాత బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది.
మొత్తంగా చూస్తే రివర్స్ లో నిర్ణయాలు.. పాత మద్యం విధానంకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టడం వల్ల ఉద్యోగుల జీతాలు.. దుకాణాల అద్దెలు కష్టమైపోతున్నాయని త్వరలో.. మళ్లీ వేలం పద్దతిన దుకాణాలు కేటాయించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.