ఏపీ ఉద్యోగుల జీతాలు తగ్గించి.. అలవెన్స్ లు కోసేసి.. పీఆర్సీని పదేళ్లకు ఓ సారి ఇస్తామంటూ రూల్స్ మార్చేసి.. ఉద్యోగులు రోడ్డెక్కేలా చేశారు జగన్ రెడ్డి. తర్వాత చర్చోపచర్చలు జరిపి వారి ప్రయోజనాలను వారికి ఇచ్చేందుకు అంగకరించి.. వారికి ఏదో మంచి చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. మా గోచీలు మాకిచ్చారు చాలన్నట్లుగా ఉద్యోగ సంఘం నేతలు జగన్ రెడ్డి నినాదాలు అందుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి పోలీసులకు కల్పిస్తున్నారు. ఇందు కోసం మొదటి అడుగుగా పోలీసుల అలవెన్స్ ల్లో భారీగా కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ లకు కల్పించినన వివిధ అలవెన్స్ ల్లో కోత విధించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం 79ని విడుదల చేసింది. జీవోకు అనుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం తెలిపింది.. దీంతో రాష్ట్ర పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ సిబ్బందికి అంతకముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్ సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా పూర్తిగా తొలిగించింది. డిప్యూటేషన్ పై ఏసీబీలో పని చేస్తున్న వారి అలవెన్స్ 30 నుండి 25 శాతానికి కుదించింది. అలాగే ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషినల్ హెచ్ఆర్ఏ సైతం తొలగించింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ కూడా ఎత్తివేసింది.
ఈ అలవెన్స్ లలో కోత విధించడం పట్ల పోలీస్ వర్గాలలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.. అలాగే విపక్షాలు సైతం ఈ కోత అలవెన్స్ ల జీవోను తప్పుపడుతున్నాయి. అయితే ఈ కోతలకు డీజీపీ కూడా ఆమోద ముద్ర వేశారు. కానీ.. పోలీసులకు ఎంతో మేలు చేస్తున్నట్లుగా చెప్పుకోవడానికి వేసిన స్కెచ్‌లో ఇదో భాగం అని.. పోలీసు సంఘాలు జగన్ రెడ్డి దగ్గరకు పోయి విజ్ఞప్తి చేయగానే వారివి వారికి ఇచ్చేసి.. పోలీసులతోనూ జేజేలు కొట్టించుకునే ప్లాన్ అమలు చేస్తున్నారని అంటున్నారు. దీని వల్ల రూపాయి ఖర్చు కాదు.. కానీ ఏదో చేసినట్లుగా ప్రచారం మాత్రం ఉంటుందని వైసీపీకి బాగా తెలుసు.