ఏపీలో నిధులు, విధులు ఉండని 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం 2022 డిసెంబర్ 16తో ముగిసింది. ఇప్పటి వరకూ వేచి చూసి ఇప్పుడు వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 55 కార్పొరేషన్లలోని ప్రతీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో కార్పొరేషన్ ఏర్పాటు, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును తెలియజేసింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూపాయి సాయం చేయడం లేదు. అమ్మఒడి లాంటి పథకాల డబ్బులను కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తున్నారు. తర్వాత బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అన్నింటికీ పాలకవర్గాలను నియమించారు. రెండేళ్ల పదవీ కాలం ఆ పాలకవర్గాలకు ముగిసింది. ఈ రెండేళ్లలో వారికి ఆఫీసు కూడా ఏర్పాటు కాలేదు. రూపాయి నిధులు రాలేదు. ఇటీవల వీరందర్నీ పిలిచి.. భారీగా పదవులు ఇచ్చామని బీసీ సదస్సు కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాతి రోజే పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఎదురు చూసేలా చేసి.. వాటికి పొడిగింపు ఇచ్చారు.
అన్ని కులాలను.. వారి కార్పొరేషన్లను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పథకాలకు ఇచ్చే నిధులు ఆ కార్పొరేషన్ల పేరుతో చూపించడం తప్ప.. ఆయా వర్గాల్లోని యువత ఆర్థికంగా ఎదిగేలా సహకరించేందుకు మాత్రం పెద్దగా ముందుకు రాలేదు. ఎవరికీ రుణాలివ్వలేదు. కానీ రాజకీయంగా తమ పార్టీ నేతలకు పదవులు కేటాయించుకోవడానికి.. ప్రచారానికి ఉపయోగపడుతూండటంతో.. కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.