విద్యార్తి సంబంధిత పథకాల లబ్దిదారులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లకు రంగం సిద్దం చేసింది. అమ్మ ఒడి , వసతి దీవెన పథకాలకు ఇచ్చే డబ్బులకు బదులుగా నేరుగా ల్యాప్ ట్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం పథకాల లబ్దిదారుల నుంచి ముందస్తు అంగీకారం తీసుకున్నారు. తమకు ల్యాప్‌ట్యాప్ వద్దనుకున్న వారికి పథకం నిధులే ట్రాన్స్ ఫర్ చేస్తారు. ప్రస్తుతానికి టెండర్లు న్యాయ సమీక్షకు వెళ్లాయి. అక్కడ ఆమోద ముద్రపడిన తర్వాత ఖరారు చేయనున్నారు. అనుకున్నట్లుగా పంపిణీ చేస్తే ఏపీలో ప్రతి విద్యార్థి దగ్గర ల్యాప్ ట్యాప్ ఉంటుందని అనుకోవచ్చు.
ల్యాప్‌ట్యాప్‌ల్లో కాన్ఫిగరేషన్ కీలకం. అయితే విద్యార్థుల అవసరాలను బట్టి బేసిక్ ల్యాప్ ట్యాప్‌లు సరిపోతాయని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అందుకే బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, అత్యాధునిక కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ల్యాప్ ట్యాప్ స్కీంపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కూడా ప్రభుత్వం కోరింది. ప్రతీ ఏటా అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో అమలు చేస్తున్నారు. అందుకే జనవరి కల్లా ల్యాప్ ట్యాప్ కోరుకున్న వారందరికీ ఇవ్వాలని నిర్ణయించారు.
ట్యాప్ ట్యాప్‌లు సరఫరా చేసేవారు మంచి సర్వీస్ సపోర్ట్ చేయాలని ప్రభుత్వం నిబంధన పెడుతోంది. ల్యాప్ ట్యాప్‌కు ప్రాబ్లం వస్తే గ్రామ సచివాలాయాల్లో ఇస్తే చాలని రిపేర్ చేయిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది అమ్మఒడి సభలో తాము ఇస్తామన్న ల్యాప్ ట్యాప్‌ను సీఎం జగన్ బహిరంగంగా ప్రదర్శించారు కూడా. ప్రస్తుత ప్రపంచంలో అంతా ఆన్ లైన్.. కంప్యూటర్ ద్వారానే విద్య సాగుతోంది. ఇలాంటి సమయంలో నాణ్యమైన ల్యాప్ ట్యాప్ చేతిలో ఉంటే… ప్రపంచం చేతిలో ఉన్నట్లే. అమ్మఒడి పథకం అందుకునేవారంతా పేదలే కావడంతో.. ఎక్కువ మంది తల్లులు.. తమ అకౌంట్లో డబ్బులు పడితే… కుటుంబ అవసరాల కోసం వాడేస్తూ ఉంటారు. దీని వల్ల పథకం ఉద్దేశం పెద్దగా నెరవేరదు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి నేరుగా విద్యార్థులకే మేలు కల్పించేందుకు…ల్యాప్ ట్యాప్ ఇవ్వాలనే ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.