ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి సవరణ తెచ్చుకోవాలనుకున్న ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మొదటి సారి స్థానిక ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ వాయిదా వేసినప్పుడు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సందర్భంగా.. కోడ్ ఎత్తివేస్తూ.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే.. .అభివృద్ధి పనుల విషయంలో మాత్రం ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను సవరించాలంటూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ సర్కార్ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఎన్నికల సంఘం ఏమైనా అభివృద్ధి పనులను ఆపిందా అని ధర్మాసనం రోహత్గీని ప్రశ్నించింది.
ఎలాంటి అభివృద్ధి పనులు ఆపలేదు కానీ… కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి కోర్టుకు తెలిపారు. అసలు కోడ్ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతిని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని రోహత్గి ప్రశ్నించారు. అయితే.. ఎన్నికలు రద్దు చేయలేదని .. వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అనుమతి ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సలహా ఇచ్చింది.తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి పనులకు కానీ.. స్కీమ్స్‌కు కానీ.. ఎస్ఈసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు అలాంటి పర్మిషన్ తీసుకుంటున్న అంశంపైనా స్పష్టత లేదు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ ఏదో ఆశించి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు తప్పనిసరిగా ఎస్ఈసీ నుంచి అన్నింటికీ ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..