హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లలో 30 శాతం ఇంటి అద్దె అలవెన్సు కూడా ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా అంగీకరిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులను జారీ చేసింది. ఒక ఏడాదిపాటు వారికి ఈ అదనపు చెల్లింపు జరుగుతుందని జిఓలో పేర్కొన్నారు. కనుక ఉద్యోగులు విజయవాడ, గుంటూరు తరలి వెళ్లేందుకు చాలా మంది ఉద్యోగులు అంగీకరించవచ్చు. అయితే, ఈ నిర్ణయం సరైనదేనా? అనే అనుమానాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా హైదరాబాద్ స్థిరపడిన ఉద్యోగులు, రాష్ట్రానికి తరలివచ్చి ఇక్కడ వసతి ఏర్పాట్లు చేసుకోవడం కొంచెం కష్టమైనా పనే. కనుక వారికి అదనపు అలవెన్సు చెల్లించడం న్యాయమే. రాష్ట్రంలో బదిలీలపై వేరే జిల్లాలకి వెళ్ళే ఉద్యోగులకి ఇంచుమించు అటువంటి సమస్యలే ఎదుర్కొంటుంటారు. కానీ వారికి ప్రభుత్వం ఈవిధంగా అదనంగా అలవెన్సులేవీ మంజూరు చేయదు. ఒకవేళ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వోద్యోగులు తమకి కూడా ఆ అదనపు అలవెన్సు చెల్లించమని డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మరో కొత్త సమస్య మొదలవుతుంది.
మరో సమస్య ఏమిటంటే, ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులలో కొందరు నేటికీ కొన్ని ఇబ్బందులు, కారణాల చేత ఏపికి తరలిరావడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ విజయవాడ తరలిరామని చెపితే అప్పుడు, ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల నేతలకి మద్య మళ్ళీ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు చేప్పట్టలేదు. అలాగని ఉపేక్షించలేదు కూడా. కనుక హైదరాబాద్ లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఏపికి తరలివచ్చే వరకు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల నేతలకి కూడా ఇటువంటి అగ్నిపరీక్షలు తప్పకపోవచ్చు.