ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతకు మించిన ఐడియాలు రావడం లేదు. పన్నులు విపరీతంగా పెంచేసి.. అదంతా ప్రజల మంచి కోసమేనని చెప్పడం ప్రారంభిస్తున్నారు. మద్యం వినియోగాన్ని తగ్గించడానికే రేట్లు పెంచామని.. పేద, మధ్యతరగతి వర్గాలుకు చెందిన తాగుబోతుల్ని నిలువుదోపిడి చేసి.. కనీవినీ ఎరుగని ఆదాయం కళ్ల జూస్తున్న ప్రభుత్వం.. అది సరిపోక ఇతర అంశాల్లోనూ పన్ను బాదేస్తోంది. తాజాగా వాహనాల పన్నును పెంచింది. దానికి హరిత పన్ను అని పేరు పెట్టింది. ఇప్పటి వరకూ రూ. 2వేల కోట్ల మేరకు వాహనాలపై వచ్చే పన్ను ఇక నుంచి రూ. రెండున్నర వేల కోట్లకు పెరగనుంది.
ఎందుకు ఇంత భారీగా పెంచుతున్నారంటే పాత వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందని.. వాటి వినియోగాన్ని తగ్గించడానికే పన్నులు పెంచామని పేర్ని నాని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. చట్టం ప్రకారం ఎంత కాలం వాహనాలు రోడ్లెక్కాలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఇలా పాతబడే కొద్దీ వాటిపై పన్నుల శాతాన్ని పెంచుతామని.. చెప్పడం ఆయా వాహనాలపై ఆధారపడి బతికే వారిని పన్నుల పాలు చేయడమే. ఇలాంటి వాహనాలన్నీ అత్యధికం రవాణా రంగంలోనే ఉంటాయి.
ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం పడుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకూ తాము పెంచాల్సిన పన్నులన్నింటికీ.. వాడకాన్ని తగ్గించడానికే అని చెప్పుకొస్తోంది. అయితే కరెంట్, నిత్యావసర వస్తువులు.. ఇలాంటి ధరలు పెరిగిపోయినప్పుడు మాత్రం అలాంటి వాదన వినిపించడం లేదు. అవి వాడకం తగ్గించడమంటే తేడా వస్తుందని భయపడుతున్నారేమో కానీ.. ఏపీ సర్కార్కు ప్రజలు ఓ మాదిరిగా కనిపించడం లేదని.. పన్నుల పెంపు సందర్భాల్లో వారు చేస్తున్న వాదనలు విన్నప్పుడల్లా అందరికీ అనిపిస్తూ ఉంటుంది.