ప్రొబేషన్ కోసం చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఎంత త్వరగా వాళ్లు ఉద్యోగాలు వదిలేసి పారిపోతే అంత మంచిదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగిపై లేని ఆంక్షలనును వారిపై పెడుతోంది. జూన్ నుంచి వారికి ప్రొబేషన్ ఇస్తామని జగన్ ప్రకటించారు. ఆ జూన్ రాబోతోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు రోజుకు మూడు సార్లు హాజరు వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంటే మూడు పూటలా తాము విధుల్లో ఉన్నామని నిరూపించుకోవాలన్నమాట. లేకపోతే జీతం కట్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి ఆంక్షల్లో ఇది మొదటిది కాదు.. చివరిది కాదు. వారిపై ఎన్నో రకాల ఆంక్షలు పెడుతున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి చేస్తున్నారు. అడ్డగోలు పనులు చెబుతున్నారు. అయితే ప్రొబేషన్ అయితే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని.. ప్రభుత్వ ఉద్యోగం అవుతుందన్న ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే పరీక్షల పేరుతో వారిని నానా తిప్పలు పెడుతోంది. పరీక్షలు రాసి ఉద్యోగం తెచ్చుకున్నా.. . తమ అపాయింట్మెంట్ లెటల్లో ఎక్కడా మళ్లీ పరీక్షలు సాసైతేనే ప్రొబేషన్ అని లేకపోయినా .. ఎపీపీఎస్సీ ద్వారా అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో అత్యధికులు సక్సెస్ కాలేకపోతున్నారు.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దుర్బరంగా ఉంది. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉంటుందని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలేసి వచ్చిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనే నమ్మకంతో వచ్చారు. ఇప్పుడు వారిలో చాలా మందిని ప్రభుత్వం వదిలించుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే రకరకాల ఒత్తిళ్లు పెడుతోందన్న అభిప్రాయంతో ఉన్నారు.