సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ లో ఆయన పని చేసినప్పుడు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన అవినీతిపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఆధారాలు సేకరించడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ఏపీ హైకోర్టుకు వెళ్లారు. ఏపీ హైకోర్టులో ఆయన కు ఊరట లభించింది. అయితే ఆయనకు ఇచ్చిన రిలీఫ్‌ను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
సంజయ్ కు ప్రభుత్వం మారినప్పటి నుండి పోస్టింగ్ లేదు. ఆయనను సస్పెండ్ చేశారు. రెండు, మూడు అవినీతి కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అవి కాక ఆయన దారి తప్పి అధికార దుర్వినియోగం చేశారని లెక్క తీయాలనుకుంటే మరో పదికేసులు బయటకు వస్తాయి. అయితే చంద్రబాబుపై సీఐడీ కేసులు పెట్టినందుకే ఆయనపై ఇలా కేసులు పెడుతున్నారన్న అభిప్రాయం రాకుండా.. ఆయా కేసుల్లో ఇంకా చర్యలు ప్రారంభించలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన చంద్రబాబు కేసులపై ఊళ్లు తిరిగి ప్రెస్ మీట్ పెట్టిన కారణంపైనే సస్పెండ్ చేసి కేసులు పెట్టవచ్చు.
జగన్ హయాంలో బరి తెగించిన ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. నిజానికి వారిలో చాలా మందిని అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయలేదు. వారిపై కాస్త సానుభూతితో వ్యవహరించింది. అయితే కొంత మంది విషయంలో మాత్రం వారికి న్యాయపరమైన అవకాశాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది.