ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం దారుణంగా విఫలమయిందని ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి ఏర్పడింది. రేపో మాపో.. ప్రస్తుతం ఉన్న ధరలను 40 శాతం వరకూ తగ్గించే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా వి.లక్ష్మణరెడ్డి ఈ మేరకు సూచనలు కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి చనిపోయిన ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. మద్యం ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. శానిటైజర్లకు అలవాటు పడుతున్నారు. ధరలు తగ్గించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ప్రకటించారు. మామూలుగా అయితే… ప్రజలతో మద్యం మాన్పించడానికే… ధరలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు తగ్గించాలన్న ఆలోచన చేయకూడదు. కానీ…ఇప్పుడు ప్రభుత్వం తగ్గించాలనుకుంటోంది. అందుకే… లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా కురిచేడు పంపించి.. తగ్గింపు ప్రకటనలు చేయించినట్లుగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం కన్నా ఎక్కువగా శానిటైజర్లు, కల్తీ మద్యం, నాటు సారాతో పాటు.. తెలంగాణ మద్యం అమ్ముడవుతోంది. వైసీపీ నేతలు.. వారికి సంబంధించిన వారు.. చివరికి వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకు వచ్చి అమ్ముతున్నారు. ఇలాంటి వారు రోజూ పట్టుబడుతున్నారు. నిన్న కర్నూలు జిల్లాకు చెందిన ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీ లారీ పట్టుబడింది. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న కొన్ని వేల వాహనాలు సీజ్ చేసినట్లుగా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. శానిటైజర్లు.. నాటు సారా వంటి కారణాలతో మరణాలు కూడా పెరిగిపోయాయి.
మరో వైపు.. కనీసం ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా అంటే… అదీ లేదు. ప్రముఖ బ్రాండ్లు అమ్మకపోవడం… పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ తరహా బ్రాండ్లు అందుబాటులోకి తేవడం.. పైగా రేట్లను భారీగా వడ్డించడంతో… అమ్మకాలు 70 శాతానికి పడిపోయాయి. ఈ 70 శాతం అమ్మకాలు పడిపోవడం.. తాగేవారు తగ్గిపోవడానికి సంకేతం అని ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కానీ వారంతా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం దెబ్బతిన్నది. ప్రభుత్వానికి ఆదాయం రాక… ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేక… ఇప్పుడేం చేయాలా అని తలలు పట్టుకుంటోంది. ధరలు తగ్గించడమే మార్గమని అధికారులు ఓ నివేదిక సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం 20 శాతం ధరలే పెంచింది. కానీ ఢిల్లీ లాంటి చోట్ల 70 శాతం పెంచారని… ఒక్క రోజులోనే తాము కూడా 70 శాతం పెంచారు. మద్యం మాన్పించడానికి షాక్ కొట్టేలా ధరలు తగ్గించామని గొప్పగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు… తగ్గిస్తే… మద్యం తాగేవారిని ప్రోత్సహించడానికి తగ్గిస్తున్నారా.. అని విపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే.. ఈ సర్కార్.. విపక్షాలను ప్రజలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. కాబట్టి.. ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.