ఆంధ్రప్రదేశ్ లో లక్షల మంది ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి బాధితులకు పంపిణీ చేసేందుకు అవసరమైన న్యాయపరమైన సమస్యలు తీరి పోవడంతో అందకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి .. ఆ ఆస్తులకు అత్యధిక విలువ వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించనున్నారు.
అగ్రిగోల్డ్ చాలా చోట్ల ఆస్తులను కొనుగోలు చేసింది. ఎక్కువగా భూములే ఉన్నాయి. వీటిని అమ్మడం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ నిధులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. నిజానికి అగ్రిగోల్డ్ బాధితులకు ఆరేళ్ల కిందటే చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేశారు.
జీ కంపెనీ పదివేల కోట్లకు కొనేందుకు ముందుకు పచ్చింది. అయితే వైసీపీ కేసులు వేసి.. ఆరోపణలు చేసి.. బెదిరింపులకు పాల్పడి ఆ సంస్థను వెనక్కి వెళ్లిపోయేలా చేసింది. తాము వస్తే ఇట్టే డబ్బులు ఇస్తామని జగన్ నమ్మించారు. తొలి బడ్జెట్ లోనే రూ.1150 కోట్లు ఇచ్చేస్తామన్నారు. కానీ అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన కొంత మొత్తాన్ని మాత్రమే ఇచ్చారు. తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మళ్లీ వారి డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి కూడా వైసీపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులే వారి ప్రయత్నాలను తిప్పికొట్టాల్సి ఉంది.