వైరస్ బారిన పడొద్దని.. ప్రజలందరనీ ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. అదే సమయంలో వైరస్ ను అంతం చేయడానికి అహర్నిశలు కొంత మంది పని చేస్తూ ఉన్నారు. వారిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. దేశం మొత్తం వీరినే ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్.. మరో వ్యవస్థను ఉపయోగించుకుని… వైరస్‌పై పోరాటం చేస్తోంది. ఆ వ్యవస్థలే.. గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు వలంటీర్లకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ‘ ప్యాకేజీ వర్తించనుంది. పీఎంజీకే ప్యాకేజీ కింద రూ. 50 లక్షల బీమా వర్తించనుంది. రాష్ట్రంలో 2,60,000 మంది గ్రామ, వార్డు వలంటీర్లున్నారు. మూడు విడతల కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లు పాల్గొన్నారు. కొవిడ్-19 పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్ అయ్యే అవకాశమున్నందున వీరికి కూడా బీమా పథకం వర్తింప జేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఆశావర్కర్లతో పాటు వాలంటీర్లు కూడా… సమానంగా పని చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అంతే కాదు.. పెన్షన్లు ఇవ్వడానికి… కరోనా సాయం పంపిణీ చేయడానికి కూడా.. లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలిపోతున్న సమయంలో… వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ప్రారంభమయింది. ముఖ్యమంత్రి దీన్ని గమనించారు. వారికీ బీమా కల్పించాల్సిన అవసరం ఉందని భావించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. రెండు లక్షల అరవై వేల వార్డు వాలంటీర్ల కుటుంబాలకు ధీమా లభిస్తోంది.
వాలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక. ఆయన ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అధికారంలోకి రాగానే వలంటీర్ల నియామాకలను చేపట్టారు. ప్రతీ యాభై ఇళ్లకు ఒకరిని నియమించారు. కొంత మంది మధ్యలో మానేస్తున్నా.. ఎప్పటికప్పుడు కొత్తవారిని నియమిస్తూ.. పేదలకు.. ప్రభుత్వాన్ని.. వారి ద్వారా దగ్గరకు చేస్తున్నారు. వారి సేవలకు గుర్తుగా యాభై లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు.