ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రల విషయంలో గొప్పలు పోవడానికి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంత వరకూ దిశ చట్టమే ఆమోదం పొందలేదు కానీ చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి ఉన్న కఠిన చట్టం పోక్సోను మించిన చట్టం తీసుకు వస్తారట. ఈ విషయాన్ని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఘనంగా ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఇళ్లలో చిన్నారులపై తండ్రులు చేస్తున్న ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలో చిన్నా రులపై జరుగుతున్న ఆకృత్యాల నిరోధానికి పటిష్టమైన చట్టం అవసరం ఉందని.. పోక్సో కంటే కఠినంగా ఆ చట్టాన్ని సిద్ధం చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా పోషణ్ మా అనే పోషకాహారం అందించే కార్యక్రమాన్ని విజయవాడ జైలులో ప్రారంభించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు హాజరయ్యారు. అక్కడే ఆమె చట్టాల గొప్పలు పోయారు. దేశంలోనే అత్యంత కఠినమైన చట్టాల్లో పోక్సో ఒకటి. దాన్ని కఠినంగా అమలు చేస్తే నిందితులకు భయం ఉంటుంది.
అయితే ఏపీ ప్రభుత్వానికి ఉన్న చట్టాల కంటే తమ సొంత చట్టాలను అమలు చేయాలనే ఉబలాటం ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. పదే పదే చట్టాలను చేస్తామని .. అదీ కూడా కేంద్రంతో సంబంధం ఉన్న చట్టాలను చేస్తామని చెప్పి ఉదరగొడుతున్నారు. ఈ చట్టాలు ఆమోదం పొందకపోయినా .. పొందినట్లుగా భ్రమింప చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మరో చట్టానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా వాసిరెడ్డి పద్మ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.