ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యప్రాచ్య దేశాల మీద ఎక్కడా లేని ఆసక్తి కనబరుస్తోంది. పెట్టుబడులు తెచ్చేందుకంటూ.. పెద్ద ఎత్తున ప్రతినిధుల్ని నియమిస్తోంది. తాజాగా.. కర్నూలు శాసన సభ్యుడు హఫీజ్ ఖాన్ ను మధ్య ప్రాచ్యదేశాలకు ఆంధ్రప్రదేశ్ సహాయ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయితే ఆయనే మొదటి వ్యక్తి కాదు. ఇప్పటికే మధ్య ప్రాచ్య దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జుల్ఫీ అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఆయనెవరో ఎవరికి తెలియదు. కొన్నాళ్ల కిందట.. సెర్బియాలో రస్ అల్ ఖైమా ఫిర్యాదు కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో.. జుల్ఫీని నియమించారు. ఆ జుల్ఫీ ఇంత కాలం ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆయా ప్రాంతాల నుంచి ఎమైనా పెట్టుబడుల ప్రతిపాదనలు తెచ్చారో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయనకు సహాయంగా హఫీజ్ ఖాన్ ను నియమించారు.
మధ్య ప్రాచ్యదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చేందుకు జుల్ఫీ, హఫీజ్ ఖాన్ ప్రయత్నిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఆయా దేశాల్లోని వాణిజ్య వేత్తలు, బ్యూరోక్రాట్లు తదితరులతో సమావేశమవుతారని ప్రకటించింది. అంటే వీరిద్దరూ ఏపీ ప్రభుత్వం తరపున మధ్యప్రాచ్య దేశాల్లో వ్యవహారాలు చక్క బెడతారన్నమాట. మధ్య ప్రాచ్య దేశాల సంగతేమో కానీ.. రస్ అల్ ఖైమాతో మాత్రం సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఆ చిన్న గల్ఫ్ దేశంతో చాలా వివాదాలు ఉన్నాయి. వాన్ పిక్, అన్ రాక్, బాక్సైట్ తవ్వకాలు ఇలా.. బోలెడున్నాయి.
ఆ దేశం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాల్లోనూ కేసులు వేసింది. కొద్ది రోజుల కిందట.. కోర్టు బయట పరిష్కరించుకునే పరిష్కార మార్గాల కోసం.. ప్రత్యేకంగా కమిటీని ప్రభుత్వం నియమించింది. మొత్తానికి ఈ మధ్య ప్రాచ్యానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యం ముందు ముందు మరింత హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.