ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి చేసిన అవినీతి విషయంలో ప్రజలకు భారం పడకుండా.. పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా చూసేందుకు చంద్రబాబు బ్యాలెన్స్డ్గా స్పందిస్తున్నారు. అదానీ – జగన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా విచారణ చేయిస్తామని ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచుతామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. విద్యుత్ ఒప్పపందాలు ప్రజలకు భారం అయితే రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. పెట్టుబడులదారుల్లో ఇప్పుడిప్పుడే విశ్వాసం పెంచుతున్నామని.. దాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను ఘోరంగా దెబ్బ తీశారని మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందన్నారు. వీటిని పరిశీలించి, మరింత దర్యాప్తు చేయించి ప్రజల ముందు వస్తామని తెలిపారు చంద్రబాబు. ఏది చేయాలో చేస్తూనే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని అన్నారు. అదానీ విషయంలో చంద్రబాబు పద్దతిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థిని దోషిగా నిలబెట్టే అవకాశం వచ్చినా.. రాష్ట్ర ఇమేజ్ .. పెట్టుబడుల ఇమేజ్ దృష్ట్యా ఆయన ప్రజాస్వామికంగా స్పందిస్తున్నారు.
అమెరికా కోర్టులో అదానీతో పాటు ఏడుగురిపై దాఖలైన చార్జిషీట్లోజగన్ రెడ్డికి రూ. 1750 కోట్లు లంచం ఇచ్చారని గుర్తించారు. ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. ఇంకా కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటో తెలియలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ రాజకీయంగా దుమారం రేగుతోంది. అదానీకి బీజేపీకి లింక్ పెట్టి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే అదానీ లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో నాలుగు ప్రభుత్వాలు బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ ఖండించింది.