న్యాయవ్యవస్థ విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న విధానం మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. తాజాగా జీవో నెంబర్ వన్ అంశంపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాకుండా ఉండటానికి ఏపీ ప్రభుత్వం అనైతిక పద్దతులకు పాల్పడినట్లుగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ పిటిషన్ విచారణకు రాకుండా ఉండటానికి.. ముందుగా లిస్ట్ అయి తర్వాత మాయం అవడానికి.. ప్రభుత్వం ఏం చేసిందో తెలుసని న్యాయమూర్తి విచారణ సమయంలో వ్యాఖ్యానించారు. ఏం జరిగిందో బెంచ్ మీద నుంచే చెప్పించే పరిస్థితి తీసుకు రావొద్దని హెచ్చరించారు. దీనిపై విచారణకు ఆదేశించాలా అని హెచ్చరించారు. న్యాయమూర్తి స్పందన న్యాయవర్గాలతో పాటు ప్రభుత్వంలోనూ కలకలం రేపుతోంది.
విధుల్లో జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఇంకా ముందుకె్ళ్లిపోయింది. ఏ పిటిషన్లు ఏ బెంచ్ విచారించాలో డిసైడ్ చేసేంతగా పరిస్థితి మారిపోయింది. న్యాయమూర్తి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చే జీవోలు.. రాజకీయ కక్ష సాధింపుల కోసం తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ప్రతీ అంశంలోనూ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహిస్తోంది. ఇలాంటి సమయంలో బాధితులకు అండగా హైకోర్టు ఉంటోంది. ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా ఎవరికీ న్యాయం దక్కకుండా తమ వేధింపులకు న్యాయవ్యవస్థ ముద్ర పడేలా చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే అనుకూల తీర్పులు ఇవ్వలేదని.. న్యాయవ్యవస్థను పూర్తి స్థాయిలో బద్నాం చేసింది. ఇప్పుడు నేరుగా కోర్టు విధుల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కొన్ని బెంచ్లపైకే తమకు అనుకూలమైన కేసులు వెళ్లేలా చేసుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారంతో వ్యవస్థపై ప్రజలు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ అంశం ముందు ముందు మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.