ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టు జడ్జిలను వేధించడం కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలయ్యే పిటిషన్లపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తులను ధర్మాసనం నుంచి వైదొలగాలంటూ.. పిటిషన్లు వేస్తున్నారు. ఈ అంశంపై న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. జస్టిస్ రాకేష్ కుమార్ సభ్యునిగా ఉన్న ధర్మాసనం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకగా దాఖలయిన అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటిని ఆయన విచారణ చేయవద్దు అంటూ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేయడం ప్రారంభించింది. ఇలా మొత్తం మూడు కేసుల్లో ఆయన విచారణ వద్దు అని కోరింది. ఈ వ్యవహారంపై జస్టిస్ రాకేష్ కుమార్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి తొలి సారి చూస్తున్నానన్నాన్నారు.
జస్టిస్ రాకేష్ కుమార్ ఈ నెల 31వ తేదీన రిటైరవుతున్నారు. ఆయన తాను విచారణ చేపడుతున్న పిటిషన్లను పరిష్కరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసి విచారణ ఆపేయాలని కోరుతున్నారు. ఉత్తర్వులు రావాలి కదా అని ధర్మాసనం అన్నా వినిపించుకోవడం లేదు. ఆయన విచారణ నుంచి వైదొలగాలని కోరుతున్నారు. ఏపీలో పోలీసులు రాజ్యాంగేతర శక్తులుగా మారి.. ప్రైవేటు వ్యక్తుల్ని అపహరించారని అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆ దిశగా వాదనలు వినిపించాలని న్యాయవాదులను ఆదేశించారు. ఇది ప్రభుత్వ న్యాయవాదులకు నచ్చలేదు. అందుకే ఆయనను టార్గెట్ చేసుకున్నారు.
ఒక్క రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపైనే కాకుండా… ప్రభుత్వ భూముల్ని తెగనమ్మడం లాంటి పిటిషన్లను కూడా ఆయనే విచారణ జరుపుతున్నారు. వాటి నుంచి కూడా రాకేష్ కుమార్ వైదొలగాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు బెదిరింపుల తరహాలో వాదనలు వినిపిస్తూండటం కూడా.. చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే న్యాయవ్యవస్థపై రకరకాల నిందులు వేస్తున్న ప్రభుత్వం తాజాగా విచారణ జరుపుతున్న న్యాయమూర్తుల్ని సైతం మానసికంగా వేధిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్‌కు చెందిన జస్టిస్ రాకేష్ కుమార్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేస్తారు.