1953, నవంబర్ 1వ తేదీన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి 2014, జూన్2న రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేవరకూ ప్రతీ ఏటా నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఒక పండుగలా ఎంతో ఘనంగా జరిగేవి. కానీ రాష్ట్ర విభజన జరిగిన తరువాత వరుసగా రెండుసార్లు ఎటువంటి కార్యక్రమం జరుపుకోకుండా గడిచిపోవడం బాధాకరం. జూన్ రెండున ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడిన రోజునే రాష్ట్రావతరణ దినోత్సవంగా తెలంగాణా ప్రభుత్వం ప్రకటించి ఎంతో ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకొంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2ని రాష్ట్ర అవతరణ దినమని నిర్దిష్టమయిన ప్రకటన చేయకుండా ఆరోజు నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర పునర్నిర్మాణ దీక్షలు చేప్పట్టడం చేత, కనీసం జూన్ 2వ తేదీన అయినా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకాకుండానే ఈ ఏడాది కూడా గడిచిపోయింది.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఇష్టం లేకపోతే కనీసం యధాప్రకారం నవంబర్ 1వ తేదీన నిర్వహించినా అందరూ సంతోషించేవారు. అదే విషయం కొందరు అధికారులు, మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో మొన్న నవంబర్ 1వ తేదీ కూడా సాధారణ దినంగానే ముగిసిపోయింది. ఒక పండుగలాగ జరుపుకోవలసిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంతాప దినంగా మార్చివేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని రాష్ట్ర అవతరణ దినాన్ని నిర్దిష్టంగా ప్రకటించాలని అందరూ కోరుకొంటున్నారు.