ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో శీతకన్ను వేయడం.. కరోనా కారణంగా విజయవాడ ఎయిర్ పోర్టుకు రద్దీ తగ్గిపోయింది. వచ్చి, పోయే విమానాల రాకపోకలు అరవై శాతానికిపైగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఉడాన్ పథకంలో భాగంగా గతంలో విమానాలు నడిపిన ట్రూజెట్ వంటి సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ కంపెనీలు కూడా తమ సర్వీసుల్ని నిలిపివేశాయి. ఇప్పుడు ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆఫర్ ఇచ్చి మరీ ఇతర కంపెనీలను విమానాలు నడపాలని పిలుస్తున్నారు.
ప్రధానంగా విజయవాడ నుంచి రాయలసీమలో ఎయిర్పోర్టులు ఉన్న కడప, కర్నూలుకు కనీసం ఒక్క సర్వీసును అయినా నడిపిచాలన్న పట్టదలతో ప్రభుత్వం ఉంది. కడపకు గతంలో విమానాలు ట్రూజెట్ నడిపేది. కానీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. దాంతో సర్వీసులు నిలిచిపోయాయి. కడప కు విమానాలు లేకుండా పోయాయి. జగన్తో పాటు సీఎం రమేష్ వంటి వాళ్లు తమ ప్రత్యేక విమానాలతో వెళ్లడానికే అది ఉపయోగపడుతోంది. ఇటీవల రూ. ఇరవై కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసి విమానాలు తిప్పేలా ఇండిగోతో ఒప్పందం చేసుకోవాలని కేబినెట్లో నిర్ణయించారు.
ఇటీవల కర్నూలు ఎయిర్ పోర్టుప్రారంభమమింది. ఓ సర్వీసు నడిపేలా చేయగలిగారు. ఇప్పుడు విజయవాడ నుంచి కూడా కర్నూలుకు ఓ సర్వీసును పెంచాలని.. రాయలసీమ వాసులకు విజయవాడతో కనెక్టివిటీ పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఇండిగోతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని విషయంలో ప్రభుత్వం కాస్త మెత్తబడటంతో పరిపాలన తప్పనిసరిగా అమరావతి నుంచే జరగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వ వ్యూహంలో మార్పులు వచ్చాయని భావిస్తున్నారు. అందుకే బెజవాడకు ఎయిర్ కనెక్టివిటీని మళ్లీ పెంచుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.