ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు.. చెప్పిన వారికి రుణాలివ్వలేదని బ్యాంకుల ఎదుట చెత్త పోసిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏపీలో ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా… నేషనల్ మీడియా హైలెట్ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన .. ఏపీలో ఉన్న పాలనా పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందన్న చర్చ జరిగింది. ఈ చర్చ ఎక్కువగా దేశస్థాయిలో వ్యాపార వర్గాల్లో జరిగింది. ప్రభుత్వాన్ని కాదంటే ఏం చేయడానికి సిద్ధపడతారన్న విషయం.. ఇలాంటి ఘటన ద్వారా వెల్లడయిందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో ఎంత చర్చనీయాంశం అయిందంటే.. చివరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నేరుగా ఏపీ అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది..? తెర వెనుక ఎవరున్నారు.. అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల ముందు చెత్త పోయడం ఒక్కటే కాదని.. ఏపీలో బ్యాంకర్లపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని.. ప్రభుత్వ పరంగా బెదిరింపులు కూడా వస్తున్నాయన్న ఫిర్యాదులు బ్యాంకర్ల వైపు నుంచి కేంద్రానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో బ్యాంకుల ముందు చెత్త పోయడం… స్వయంగా మున్సిపల్ కమిషనర్లే అలా పోయాలని ఆదేశించినట్లుగా తేలడంతో… ఇది వారంతటికి వారు తీసుకున్న నిర్ణయం కాదని.. పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే కారణం అని నమ్ముతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక వర్గాల్లో తీవ్రమైన ప్రభావం చూపుతాయి. రాష్ట్రంపై ఓ రకమైన బ్యాడ్ ఇమేజ్ ఏర్పరుస్తాయి. ఇప్పటికే పారిశ్రామిక వర్గాల్లో ఉన్న నెగెటివ్ ఇమేజ్‌కు .. ఇలాంటివి మరింత ఘటనలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.త ఈ ఘటనపై బ్యాంకర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖలు రాశారు.