ఎన్నికల కమిషన్ సొంతంగా యాప్ వినియోగించకుండా.. పంచాయతీరాజ్ శాఖ తయారు చేసినయాప్నే వినియోగించేలా చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ప్రభుత్వం… అలా ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్‌ను లాంఛ్ చేయగానే ఇటు హైకోర్టులో పిటిషన్ వేసింది. అత్యవసరంగా విచారించాలని కోరింది. అయితే హైకోర్టు మాత్రం అంత అత్యవసరం ఏమీ లేదని.. రేపు విచారించవచ్చని తేల్చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ వాచ్ యాప్‌ను… ఎస్ఈసీ పదకొండు గంటలకు విడుదల చేశారు. టెక్నికల్ స్టాఫ్ యాప్ ను ఎలా వాడాలో వివరించారు. ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు.. యాప్ పనితీరును వివరించారు.
పోలింగ్ బూత్‌లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని బయట కూడా నిఘా పెట్టేలా యాప్ తీర్చిదిద్దుతున్నామని నిమ్మగడ్డ గతంలోనే ప్రకటించారు. ప్రకారం.. యాప్‌ను విడుదల చేశారు. దీన్ని ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్రమాలపై ఫిర్యాదుకు సామాన్యులు కూడా.. సాక్ష్యాలు పంపవచ్చు. ఈ యాప్‌ను కేవలం ఫోన్ ద్వారానేకాకుండా… వెబ్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించేందుకు కూడా ప్రత్యేకంగావ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫిర్యాదు ఎవరి దగ్గర ఆగిందో తెలిసేలా ఈ-వాచ్ యాప్‌ను రూపొందించారు. ఫిర్యాదు వచ్చాక సీరియస్, నాన్ సీరియస్‌గా కాల్ సెంటర్లో విభజించి.. పరిష్కరిస్తారు.
ఈ యాప్ విడుదల కార్యక్రమం జరుగుతూడంగానే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎస్ఈసీ యాప్ పూర్తిగా ప్రైవేటు యాప్ అని దానికి సెక్యూరిటీ పరమైన అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన యాప్‌లన్నింటికీ అనుమతులు ఉండాలని .. తక్షణం ఆ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని కోరింది. భద్రతా సమస్యలు.. హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ పిటిషన్లో కొన్ని పార్టీలకు మేలు చేసేందుకు యాప్‌ను తీసుకొచ్చారని కూడా చెప్పారు. అది ఎలా మేలు చేస్తారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ యాప్ గురించి నిమ్మగడ్డ చెప్పినప్పటి నుండి అదేపనిగా.. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చివరికి కోర్టుకు కూడా వెళ్లారు.