ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి సారిగా అమరావతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతోంది. అయితే ఆ అభివృద్ధి పనులు.. అమరావతిలో మధ్యలో ఎక్కడివక్కడ ఆగిపోయిన అభివృద్ధి పనులు కాదు.. ముఖ్యమంత్రి సొంతంగా ఆలోచించిన అభివృద్ధి పని. అదే కరకట్ట రోడ్డు అభివృద్ధి. సీఆర్డీఏను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ గా మార్చారు. ఈ విషయం కోర్టులో ఉన్నప్పటికీ.. ఏఎం ఆర్డీఏ పేరు మీదనే వ్యవహారాలు నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఏఏంఆర్డీఏ తరపున కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని గతంలో నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
చాలా రోజుల కిందటే.. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరణకు సంబంధించి రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలనేది సీఎం ఉద్దేశం. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు దాదాపుగా పూర్తయిందని దానిని పూర్తి చేస్తే.. కరకట్ట రోడ్డును విస్తరించాల్సిన పని లేదని.. అమరావతి అభివృద్ది పనులపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.
సీఎం జగన్.. ప్రజలు డబ్బులు కట్టిన హ్యాపీ నెస్ట్ సహా.. చివరి దశలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతీసారి చెబుతూంటారు. మీడియాలో హైలెట్ చేస్తూంటారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కూడా డబ్బులు అప్పు తీసుకుని కట్టాలని ఆదేశించారు. అప్పులు దొరకలేదు.. పనులు ప్రారంభం కాలేదు. కరకట్ట రోడ్డు విస్తరణ కోసం రూ. 150 కోట్లు ఖర్చవుతాయి. గురువారం సీఎం శంకుస్థాపన చేస్తారు. కానీ కాంట్రాక్టర్ ఎవరో ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదని చెబుతున్నారు.