ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవ్వాళ్ళ విజయవాడలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన ఉద్యమం, దాని పర్యవసానాలపై చర్చ ప్రధాన అజెండాగా ఉండవచ్చును. ఆయనను, వైకాపాను ధీటుగా ఎదుర్కోవడంలో పార్టీ నేతల వైఫల్యంపై ముఖ్యమంత్రి తన మంత్రులకు క్లాసు తీసుకొనే అవకాశం ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి పెరిగిపోతునందున, దాని కోసం వేసిన జస్టిస్ మంజునాధ కమీషన్ గడువును తొమ్మిది నెలల నుండి ఆరు లేదా మూడు నెలలకు కుదించడం, దాని విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించవచ్చును. కాపులకు ఏటా వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్ళలో మొత్తం ఐదువేల కోట్లు ఇస్తామని తెదేపా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినందున, ప్రతిపక్షాలు, కాపు నేతలు కూడా ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోమని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కనుక 2015,2016 సం.లకు కలిపి మొత్తం రెండు వేల కోట్లు కాపు కార్పోరేషన్ కి కేటాయించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆవిధంగా చేసినట్లయితే ముద్రగడ పద్మనాభం ఉద్యమం పాక్షికంగా విజయవంతం అయినట్లే భావించవచ్చును. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ క్రెడి తనదేనని చెప్పుకోవచ్చును. వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్, ఇతర అంశాల గురించి ఈరోజు జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చును.