హైదరాబాద్ ముస్లింలదని ఎవరైనా అనుకుంటారా..? అక్కడ అభివృద్ధి జరిగితే.. వారే బాగుపడతారని ఎవరైనా అనుకుంటారా..? బెంగళూరు… ఒకే వర్గానిదని ఎవరైనా అనుకుంటారా..? నిజానికి.. బెంగళూరులో ఆంధ్రులే ఎక్కువ. చెన్నై కూడా అంతే. ఆ మాటకొస్తే రాజధానులన్నీ అంతే. ఎవరూ.. ఏ ఒక్కరూ… అది ఒక్కరికే పరిమితమని అనుకోరు. కానీ.. ఏపీలో మాత్రం… ఏపీ రాజదాని ఒక్క సామాజికవర్గానిదే అనుకుంటున్నారు. అందుకే.. అందరూ అభివృద్ధి చెందుతూ ఉంటే.. ఏపీ వాళ్లు మాత్రం.. సామాజికవర్గాల పేరుతో.. అడుగుకు దిగిపోతున్నారు. ఈ పతనం ఎంత వరకూ ఉంటుందో ఊహించలేం.
అమరావతి ఒక్క సామాజికవర్గానిదేనా…?
ఆంధ్రప్రదేశ్లో ఒక్కో చోట ఒక్కో సామాజికవర్గం అధికంగా ఉంటారు. రాయలసీమలో రెడ్లు, కోస్తాలో కమ్మలు, ఉత్తరాంధ్రలో బీసీలు… అన్ని చోట్ల.. దళితులు ఉంటారు. ఇది కామన్.. రాజధానిని అమరావతిలో పెట్టాలనుకున్నప్పుడు… ముఖ్యమంత్రి కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి.. అక్కడ కమ్మలు ఎక్కువగా ఉంటారు కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకున్నారు. కానీ.. ఏ విధంగా చూసినా.. అప్పటికే విజయవాడ… వాణిజ్య కేంద్రంగా ఉంది. మరి రాజధానిగా.. అక్కడ కాక ఇంకెక్కడ పెట్టినా… పనులు జరగవని అందరికీ తెలుసు., అయినప్పటికీ.. అమరావతిపై సామాజిక ముద్ర వేసేశారు. మెజార్టీ ప్రజలు గుడ్డిగా నమ్మేశారు. ఇప్పటికీ అదే జరుగుతోంది.
రాజధాని భూములు ఏ సామాజికవర్గం వారిలో బయట పెట్టలేరా..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో.. ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకతోనే ఉంది. అమరావతిలో లెక్కలేనంత అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి రాగానే మొత్తం బయట పెడతామని ప్రకటించింది. దానికి తగ్గట్లుగానే వైసీపీ అధికారంలోకి రాగానే.. కార్యాచరణ ప్రారంభించిది. కమిటీలు..సబ్ కమిటీలు నియమించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్ మీడియాలో.. టీడీపీ నేతలు… 35వేల ఎకరాలు కబ్జా చేశారని.. కథనాలు ప్రసారం చేశారు. సీబీఐ విచారణకు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అప్పుడు జగన్ మీడియా ఏ ఆధారాలతో కథనాలు రాసిందో కానీ ఇప్పుడు అధికారికంగా ఆ మాత్రం సమాచారం బయట పెట్టలేకపోతోంది. కానీ అప్పటి ఆరోపణలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిలో 80 శాతం భూములు ఒకే సామాజికవర్గం వారివని.. ప్రచారం చేస్తున్నారు. కానీ వివరాలు బయట పెట్టడం లేదు. ఎన్నికలకు ముందు డీఎస్పీలందరూ కమ్మోళ్లే అనిప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ వివరాలు చెప్పడం లేదు. అంతా.. ఆ తరహా ప్రచారమే..
అమరావతి అభివృద్ధి ఏపీ అభివృద్ధి కాదా..?
రాజధాని విషయంలో… ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ.. ఏదైనా ఆధారం ఉంటే.. ఏపీ సర్కార్ ఇప్పటి వరకూ ఆగేది కాదని.. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పడి నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఎవరికైనా అర్థమైపోతుంది. అయినప్పటికీ.. అమరావతిపై ఈ తరహా ప్రచారం ఎందుకు జరుగుతోందన్నది చాలా మందికి అంతుచిక్కని విషయంగా మారింది. రూపాయి ఖర్చు లేకుండా 33వేల ఎకరాలు భూసమీకరణ జరిపిన ప్రాజెక్ట్ గా ప్రపంచంలోనే చర్చనీయాంశమైన అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని.. గత ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని.. పైగా.. అమరావతి ఏపీకి అతి పెద్ద ఆస్తిగా మారుతుందని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్.. అమరావతి విషయంలో.. నెగెటివ్ భావనతోనే ఉంది. కారణం.. అమరావతిని అభివృద్ధి చేస్తే ఒక్క సామాజికవర్గమే బాగుపడుతుందన్న అభిప్రాయమే. దీన్ని ప్రజలు నమ్మేలా చేసి.. ఏపీ ప్రజల కన్నును.. ఏపీ ప్రజల వేళ్లతోనే పొడుస్తోంది.