ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ కొనసాగింపు కోరుకోవడం లేదా..?. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారి మాటలు అదే చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి లాక్డౌన్ కొనసాగించాలనే ఆలోచన లేదని.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే.. నిర్ణయాలు ఉంటాయని.. విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ.. లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటన చేశారు. ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలు.. తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ 30వ తేదీ వరకూ ఉంటుందని ప్రకటించింది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమమని.. ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో మాట లేకుండా చెబుతున్నారు.
అయితే ఇలాంటి క్లారిటీ ఏపీ సర్కార్ వైపు నుంచి రావడం లేదు. ఇంత వరకూ లాక్ డౌన్ ఉంటుందా లేదా.. అన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. ఆర్టీసీ సర్వీసుల కోసం మాత్రం.. బుకింగ్స్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు.. దాదాపుగా ఇరవై వేల టిక్కెట్లు ప్రజలు ఆన్ లైన్లో బుక్ చేసుకున్న తర్వాత.. అంతర్రాష్ట్ర సర్వీసుల టిక్కెట్ల బుకింగ్‌ను నిలిపివేశారు. తర్వాత ప్రధానమంత్రి లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన బుకింగ్స్‌నూ నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వ ఆలోచనల ప్రకారం.. హాట్ స్పాట్స్‌లో మాత్రం… లాక్ డౌన్‌ను కొనసాగించి.. అవసరం లేని చోట్ల.. లాక్ డౌన్ ఎత్తివేయాలన్న సూచనలు కేంద్రానికి చేయాలనుకున్నట్లుగా తెలుస్తోంది.
శనివారం రోజు.. ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఆ కాన్ఫరెన్స్‌లో.. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను.. నరేంద్రమోడీ తెలుసుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయంలో.. ఏపీ సీఎం.. హాట్ స్పాట్లకే.. లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం… లాక్ డౌన్ వల్ల రైతులు సహా..ప్రతీ వర్గం.. ఇబ్బందులకు గురవుతోంది. ఇది పొడిగిస్తే.. మరిన్ని సమస్యలు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.