ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రాన్ని చాలా తేలికగా తీసుకుంటోంది . ఎంతతేలికగా తీసుకుంటోంది అంటే… సమాధానం చెప్పాలని లేఖలు రాసినా వాటిని తీసి చెత్తబుట్టలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచే కాదు… రాజ్యాంగ వ్యవస్థల నుంచి తాఖీదులు వచ్చినా అదే పరిస్థితి. నిన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం కేటాయించే ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణానికి ఇచ్చిన అంశంపై వివరాలివ్వాలని అడిగినా రాష్ట్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రం నుంచి చీఫ్ సెక్రటరీకి ఓ లేఖ వచ్చింది. రెండు నెలల క్రితం వివరాలు అడిగింది కేంద్రం. కానీ పట్టించుకోలేదు.
ఒక్క ఆ లేఖ మాత్రమే కాదు… మత మార్పిళ్ల అంశంపైనా… విద్యార్థుల ఆత్మహత్యల నిరోదంపైనా.. ఆర్థిక అవకతవకల విషయంలో కాగ్ అభ్యంతరాలపైన… మతం మార్చుకుని రిజర్వుడ్ సీట్ల నుంచి గెలిచిన వారి ఫిర్యాదులపైనా . .. ఇలా కేంద్రం నుంచి అనేకానేక తాఖీదులు వస్తున్నాయి. కానీ రాష్ట్రం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. చివరికి సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై ఉన్న కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేసించినా డోంట్ కేర్. ఓ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉనికి ఏపీ ప్రభుత్వం గుర్తించడం లేదు. చివరికి అప్పులుతిరిగి చెల్లించకపోతే .. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు వచ్చి సెక్రటేరియట్లో కూర్చుంటే మాత్రమే స్పందించి.. బతిమాలి వెనక్కి పంపారు. అప్పటి వరకూ రాకపోతే అసలు పట్టించుకోవడం లేదు.
కేంద్రాన్ని , రాజ్యాంగ వ్యవస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా లైట్ తీసుకుటోందంటే… చివరికి రాజమండ్రి శిరోముండనం ఘటనలో చర్యలు తీసుకోవాలని స్వయంగా రాష్ట్రపతి లేఖ రాసినా లైట్ తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో కేంద్రంలోని ఉన్నాతాధికారులకూ అర్థం కావడం లేదు. అయితే వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. తమను ధిక్కరించినా… చూసీ చూడనట్లు పోతున్న పాలకులే అండగాఉంటే నిబంధనల ప్రకారం వెళ్లాలనుకుంటున్న తాము ఏమీ చేయగలమని భావిస్తున్నట్లుగా ఉంది.