ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కార్ హైకోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్ఈసీతో సంప్రదింపులు కూడా జరిపే ఉద్దేశంలో లేనట్లుగా ఉంది. చర్చల విషయంపై ఇంత వరకూ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోగా… తాజాగా… జెడ్పీ, ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలలు పాటు ఇప్పుడున్నట్లుగానే స్పెషల్ ఆఫీసర్లు స్థానిక సంస్థల్లో పరిపాలన చేస్తారు. మండల పరిషత్లో జులై 3, జిల్లా పరిషత్లో జులై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది.
ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించబోమని చెబుతున్నారు. అందు కోసం రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. చివరికి వ్యాక్సిన్ వేయాలన్న కారణం కూడా చెప్పారు. చివరికి ఈ కారణం వల్లనే.. ప్రభుత్వం , ఎస్ఈసీ సంప్రదింపులు జరపాలని ఆదేశించింది.
ఈ విషయంలో ప్రభుత్వం .. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి వస్తుంది. అందుకే ఏపీ సర్కార్ వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఈసీ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో ఏర్పడింది.