మొండి వాడు రాజు కన్నా బలవంతుడు. ఆ మొండివాడు రాజు అయితే.. ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని టీవీ చానళ్లను.. నిలుపుదల చేయడంపై… దేశం మొత్తం… టీవీచానళ్ల వివాదాలను చక్కదిద్ది.. వినియోగదారుల హక్కులను కాపాడే టీడీశాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. గత రెండు విడతలుగా… ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లను ప్రసారం చేయాల్సిందేనని ఆదేశిస్తూ.. స్పష్టమైన ఆదేశాలిచ్చిన టీడీశాట్‌ను ఏపీ సర్కార్ పట్టించుకోలేదు. అప్పటే రోజుకు రూ. రెండు లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లుగా ప్రకటించినా లైట్ తీసుకున్నారు. దీంతో ఆయా మీడియా సంస్థలు మరోసారి టీడీశాట్‌ను ఆశ్రయించాయి. అయినా ప్రభుత్వం.. సాంకేతిక కారణాలను సాకుగా చెప్పింది. దాంతో 22వ తేదీ వరకూ గడువిచ్చింది టీడీశాట్.
తమ ఆదేశాలను పాటించకపోవడాన్ని కోర్టు ధిక్కారణగా భావిస్తామని టీడీశాట్ స్పష్టం చేసింది. సాంకేతిక కారణంగానే ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించేప్రయత్నం చేశారు. ఈ నెల 22లోపు ఏబీఎన్ ప్రసారాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో.. కేసును 22వ తేదీకి వాయిదా వేసింది టీడీశాట్. గతంలో జరిమానా విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అమలు చేయకపోవడంతో.. ఏపీ ఫైబర్ నెట్‌కు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ జరిమానా మొత్తాన్ని 22న నిర్ణయించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. వ్యతిరేక వార్తలు రాస్తే అసలు సహించడం లేదు. చానళ్లను నిలిపివేయడం మాత్రమే కాదు… ఆంధ్రజ్యోతికి ప్రకటనలు కూడా ఆపేసింది. ప్రభుత్వ వైఖరి కారణంగా… పత్రికల విలేకరులపై దాడులు కూడా ప్రారంభమయ్యాయి. ఓ ఆంధ్రజ్యోతి విలేకరి పట్టగలలు.. హత్యకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో ఇది జరిగింది. ఈ రోజు శ్రీకాకుళంలో విశాలంధ్ర ప్రతినిధిని వైసీపీ నేతలు కొట్టారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా తీవ్ర నిర్బంధాలను ఎదుర్కొంటోంది.