ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారికి అలవాటయిపోయిందేమో కానీ ఎవరైనా పండక్కి.. పబ్బాలకు వెళ్లి వస్తున్న వారు మాత్రం మరోసారి ఏపీకి వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఊళ్లో తిరుగుదామన్నా కనీసం రోడ్డు ఉండని పరిస్థితి. ఇంత దారుణమైన మౌలిక సదుపాయాల కొరత .. పూర్తి స్థాయిలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఉంటుంది. ఇప్పుడది ఏపీలో కనిపిస్తోంది. మరో వైపు ఏపీ ప్రభుత్వ పాలకుల మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉంటాయి. ప్రతీ వర్షాకాల సీజన్ కల్లా రోడ్లను అద్భుతంగా చేయాలని ఆదేశిస్తూ ఉంటారు. డెడ్ లైన్ పెడతారు.
కానీ ఒక్క రోడ్డు బాగు కాదు సరి కదా.. మరింత పాడైపోతూ ఉంటాయి. గంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకునేవారు పోగొట్టుకుంటూ ఉంటారు.. గాయాల పాలయ్యేవారు .. అవుతూనే ఉంటారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎంచక్కా.. పది.. ఇరవై కిలోమీటర్లు కూడా హెలికాఫ్టర్లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రజలకేమో.. డెడ్ లైన్లు పెట్టి ఆశలు కల్పిస్తూ.. ప్రకటనలు చేస్తూంటారు. ఇప్పటికి కనీసం నాలుగైదు సార్లు రోడ్ల పై సమీక్షలు చేసినప్పుడు డెడ్ లైన్లు పెట్టి.. నాడు – నేడు అంటూ పోస్టర్లు వేసి ప్రదర్శిద్దాం అని చెప్పి మరీ మడమ తిప్పేసిన ప్రభుత్వపెద్దలు నేడు మళ్లీ మార్చి ముహుర్తం పెడుతున్నారు.
చాలా వకూ ఊళ్లలో రోడ్ల పరిస్థితికి ప్రజల శాపనార్ధాలు పట్టలేక.. స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు కాస్తంత మట్టి తెచ్చిపోయిస్తున్నారు. కానీ అది తాత్కలికమే. వారం రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ప్రజలబాధలు ఏ మాత్రం పట్టని పాలకులు మాత్రం.. తమ ధీరోదాత్తమైన ప్రకటనలతో సయమం గడిపేస్తూ.. ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉన్నారని.. రేపు బ్యాలెట్ ఓపెన్ చేస్తే.. ఆ గుంతల్లో అయినా సరే కిందా మీదా పడి తనకే ఓట్లేస్తారని ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.