ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పరిపాలనా పరంగా తెలుగు రాని అధికారులు కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. అయితే ఇంగ్లిష్ అనేది కామన్ లాంగ్వేజ్ గా మారిపోయింది కాబట్టి ఇంగ్లిష్ ఉత్తర్వుల కాపీ కూడా అందుబాటులో ఉంచే అవకాశంఉంది. అసలైన జీవోలు మాత్రం తెలుగులో ఉండనున్నాయి.
ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అందులో పలువురు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో సూచించారు. అలాగే చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ తెలుగు సమాఖ్య సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. అయితే పూర్తిగా జీవోలన్నీ ఇంగ్లిష్ టెంప్లెట్ కే పరిమితమయ్యాయి. ఇక నుంచి పద్దతి మార్చాలని నిర్ణయించుకున్నారు.
జగన్ రెడ్డి హయాంలో తెలుగుకు కూడా కులం అంటించి మాట్లాడి.. తెలుగు మీడియం ఎత్తేశారు. ఈ క్రమంలో తెలుగు భాష అంతరించిపోతుందేమోనని కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. తమ భాషను కాపాడుకుంటూనే.. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించి ముందుకెళ్తున్నారని కానీ తెలుగు వాళ్లు మాత్రం ఇంగ్లిష్ మాత్రమే నేర్చుకోవాలన్నట్లుగా పరిస్థితి మారింది. దీన్ని మార్చే క్రమంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అధికార ఉత్తర్వులు తెలుగులో వస్తే ప్రజలకు కూడా అర్థమవుతాయి.