నెలకు రూ. నాలుగు లక్షల వరకూ జీతభత్యాలు అందుతున్నా.. చేయడానికి పనేమీ లేదన్న అసంతృప్తితో .. కె.రామచంద్రమూర్తి తన సలహాదారు పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఆయనను సలహాలు తీసుకునే పనికి తీసుకున్నా.. ఇంకే పని చేయించుకున్నా.. ఆయన సంతృప్తి పడి ఉండేవారు. చివరికి ఆయనకు సరిపడని పని చెప్పినా చేసి ఉండేవారు. మీడియాను అణిచివేస్తూ.. జీవోలు తెచ్చినప్పుడు.. తన విధానానికి వ్యతిరేకంగా మీడియా గొంతు నొక్కడం .. కరెక్టేనని ఆయన వాదించారు కూడా. కనీసం.. ఆ తర్వాతైనా.. ఆయనను అలాంటి పనులకైనా వాడుకుని ఉంటే సంతృప్తి పడేవారు. కానీ వాడుకోలేదు. అందుకే అసంతృప్తికి గురయ్యారు. కొన్ని దశాబ్దాల పాటు.. ఆయన ప్రభుత్వాలపై.. ప్రజాధనం వృధాపై కథనాలు రాసి ఉంటారు కాబట్టి.. ఊరకనే వారి సొమ్ము ఇక తినడం ఇష్టం లేక రాజీనామా చేసి ఉంటారు. కానీ ఇప్పటికీ.. ఎలాంటి పనీ పాటా లేకుండా.. లక్షలు తీసుకుంటున్న సలహాదారులు…30మందికిపైగానే ఉన్నారు.
మొత్తం 33 మంది “హై పెయిడ్” సలహాదారులు..!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 33 మంది సలహాదారుల్ని నియమించుకుంది. వీరందరికీ.. ఒక్కొక్కరికి.. నెలకు రూ. మూడు లక్షల వరకూ జీతం ఉంది. ఇత భత్యాల రూపంలో మరో రెండులక్షల వరకూ లభిస్తాయి. చాలా మంది సలహాదారులకు.. కారు, డ్రైవర్.. ఇతర సిబ్బంది వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. వారికి అదనం. వారందరికీ ఏ ఏ విభాగాల్లో సలహాలు ఇవ్వాలో కూడా.. నిర్దేశించారు. వీరిలో 10 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. కేబినెట్ హోదా ఉన్న వారికి వారి రేంజ్‌లోనే జీతభత్యాలు ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ కన్నా… సలహాదారులకే ఎక్కువ జీతాలుంటాయి.
కేబినెట్ ర్యాంకులో ఉండి గోళ్లు గిల్లుకునే సలహాదారులు..!
అజేయకల్లాం, కె.రామచంద్రమూర్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, జుల్ఫీరావ్డీ, సాగి దుర్గా ప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హాసన్, ఎం. శామ్యూల్ లకు… కేబినెట్ ర్యాంక్ సలహాదారుల పదవి ఉంది. రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. మిగతా వారిలో ఎవరి పేరైనా ఎక్కడైనా సలహాలిచ్చేవారి జాబితాలో వినిపించి ఉండదు. వీరంతా.. వైసీపీ కోసం పని చేస్తారు. దేవులపల్లి అమర్ అప్పుడప్పుడూ టీవీ చర్చల్లో పాల్గొని.. వైసీపీని నవ్వుల పాలు చేస్తూంటారు. జీవీడీ కృష్ణమోహన్.. పేరుకు కేబినెట్ ర్యాంక్ సలహాదారు.. కానీ ఆయన మాత్రం.. ముఖ్యమంత్రి స్పీచ్‌లు రాస్తూంటారు. తలశిల రఘురాం.. పార్టీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూంటారు. ఇప్పుడూ అదే చేస్తారు. కానీ ప్రజాధనం జీతం. మిగిలిన వారికి అసలు పని ఉండదు. కానీ సమయానికి ప్రజా ధనం జీతాల రూపంలో… లక్షలకు లక్షలు అందుతూనే ఉంటాయి. వీరిలో కొంత మంది నియామకం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కేబినెట్ ర్యాంక్ ఉన్న జుల్ఫీరావ్డీని .. రస్అల్ ఖైమా దేశం నిమ్మగడ్డ ప్రసాద్‌ను పట్టుకున్న తర్వాత గల్ఫ్ దేశాల ప్రతినిధి పేరుతో కేబినెట్ ర్యాంక్‌లో నియమించారు. ఆయన నియామకం ఫలించినట్లుగానే ఉంది…. కానీ ఆయన ఎప్పుడూ ఎవరికీ కనిపించిన దాఖలాలు లేవు.
ఈ సలహాదారులకే పనేమీ లేదనుంటే.. వీరికో టీమ్..!
ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో.. హంగామా చేసిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి … వివిధ సందర్భాల్లో సహకరించిన వారికి కృతజ్ఞతగా పదవులు ఇచ్చినట్లుగా తెలుస్తంది. శిల్పా చేకుపల్లి అనే తెలంగాణ డాక్టర్‌కు ఢిల్లీలో ఉండేలా హెల్త్ సలహాదారు పదవి ఇచ్చింది.. ఆమెకు అక్కడ ఉండేందుకు నివాస అవవసరం తీర్చడానికని.. అధికారవర్గాలందరికీ తెలుసు. ఇలా ప్రజాధనాన్ని సలహాదారులకు… పార్టీ కోసం ప్రచారం చేసిన వారికి.. పార్టీ పెద్దలకు ఇష్టమైన వారికి.. పంచి పెడుతున్నారు. ఒక్కరి సలహాలు తీసుకోరు.. అడగరు. కొసమెరుపేమిటంటే… ఈ సలహాదారులు ఒక్కొక్కరూ.. ఎనిమిది మందిని నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చాలా మందికి టీమ్ ఉంది కూడా..!
అందరి సలహాలను ఆయనొక్కరే ఇస్తారు..!
ముఖ్యమంత్రి జగన్‌కు అన్నీ తెలుసా.. సలహాలివ్వకపోతే ఎలా అనే.. సందేహం చాలా మందికి రావొచ్చు. కానీ అందరి సలహాలు ఒకరు ఇస్తారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన కుడిభజం. ఆయన ఎంత చెబితే అంత. ఆయన చెబితే.. మళ్లీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదు. ప్రజా వ్యవహారాల సలహాదారు అని పేరు పెట్టినా… యాక్టింగ్ సీఎంగా.. అన్ని శాఖల వ్యవహారాలనూ చక్క బెడుతూంటారు. ఈయన పని చేసి.. అందరికీ జీతాలు పంచుతున్నాడన్నమాట.