పరిషత్ ఎన్నికలను ఉన్న పళంగా పూర్తి చేయకపోతే ప్రివిలేజ్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామన్న సంకేతాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వైసీపీ పంపింది. గతంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఎస్ఈసీ నిమ్మగడ్డపై తమ హక్కులకు భంగం కలిగించారని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఇప్పుడు మరోసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. సభాహక్కుల ఉల్లంఘన నేరం కింద.. ఆయనను విచారించాలని..నిర్ణయించారు. విచారణకు అందుబాటులో ఉండాలని ఆయనకులేఖ రాయాలని అసెంబ్లీ సెక్రటరీని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది.
గతంలో ఈ అంశంపై పెద్ద రచ్చే జరిగింది. రెండు సార్లు ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. అయితే అప్పట్లో గవర్నర్‌తో సమావేశాలు తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. నిమ్మగడ్డ క్షేత్ర స్థాయి పర్యటనలు మానేసి… ఆఫీసులోనే ఉంటున్నారు. విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో విపక్షాలు ఆయన లొంగిపోయారని విమర్శలు చేశాయి. చేస్తున్నాయి కూడా. అంత కాలం ఆ ప్రివిలేజ్ నోటీసుల్ని పెద్దగా పట్టించుకోని… వైసీపీ.. హఠాత్తుగా ఆ అస్త్రాన్ని బయటకు తీసింది. ఆయనకు నోటీసులు జారీ చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీనికి కారణం.. పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ ఆసక్తి గా లేకపోవడమేనని చెబుతున్నారు. పరిషత్ ఎన్నికలకు మళ్లీ మొదటి నుండి నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్ఈసీ సమయం అడిగారు. దాంతో వాయిదా పడింది.
ఈ లోపు నిమ్మగడ్డ సెలవు పెట్టారు. ఆయన సెలవు పెడితే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. ఆయనను నిలువరించడానికే అందుబాటులో ఉండాలని అసెంబ్లీ సెక్రటరీతో లేఖ రాయించే వ్యూహం అమలు చేస్తున్నారంటున్నారు. ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే కౌంటర్ దాఖలు చేయడం లేదని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఆయన పదవీ విరమణ చేసే లోపు ఆ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సీఎం కూడా పట్టుబడుతున్నారు. ఆరు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సమావేశాల్లో చెబుతున్నారు. వ్యాక్సినేషన్ కు అడ్డం అంటూ కొత్తగా ఆయన తన వాదన వినిపించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పాలని ఆదేశించారు. ఈ క్రమంలో పరిషత్ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలో… ఇప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దని ప్రివిలేజ్ కమిటీ పేరుతో వైసీపీ బెదిరిస్తోందన్న విమర్శలు ఇతర పక్షాల నుంచి వస్తున్నాయి.