అవ్వాతాతలకు రెండున్నరేళ్ల తర్వాత రూ. 250 పెంచుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి మాత్రం భీకరమైన ప్లాన్ రూపొందించారు. మొత్తంగా అది మూడు, నాలుగు రోజుల ప్రచార ప్రణాళిక. ఓ రోజు ఫుల్ పేజీ యాడ్స్.. టీవీ ప్రకటనలు.. సీఎం జగన్ సందేశం అన్నీ ఉంటాయి. అయితే ఈ సారి బహిరంగసభ కూడా పెడుతున్నారు. అంతకు మించి ప్రతి ఒక్క లబ్దిదారుడు వద్దకు వెళ్లి .. ఈ విషయాన్ని గొప్పగా చెప్పడానికి తాము ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థను వాడుకోతున్నారు.
ప్రభుత్వం రెడీ చేసిన ప్రణాళిక ప్రకారం ఈ రోజు.. రేపు గ్రామ వాలంటీర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ లబ్దిదారుల వద్దకు వెళ్తారు.. వారికి సీఎం జగన్ రాసిన లేఖను అంద చేస్తారు. అవ్వాతాతలకు సీఎం జగన్ చెప్పిన మాటలను ఎలా నేరవేరుస్తున్నారో చెబుతారు. తర్వాత వారితో సెల్ఫీ దిగుతారు. అంతా బాగుంది కానీ ఈ సెల్ఫీ ఎందుకనేది చాలా మందికి డౌట్. అయితే.. వార్డు వాలంటీర్లు అలా లబ్దిదారులను కలిసి జగనన్న గొప్పదనం గురించి చెప్పారా లేదా అన్నదానికి ఫ్రూఫ్ అన్నమాట అది. ఆ సెల్ఫీ దిగి అప్ లోడ్ చేయాలి. అలా అందర్నీ మిస్ కాకుండా కవర్ చేస్తారు.
రెండురోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఒకటోతేదీన సీఎం జగన్ పెదనందిపాడులో ఈ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీన్ని అన్ని గ్రామ సచివాలయాలు.. రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున న్యూ ఇయర్ కాబట్టి.. ఇక ఫుల్ పేజీ యాడ్స్.. ఉండనే ఉంటాయి. ఈ సారి కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే రూ. 250 వృద్ధులకు పెంచి… కొన్ని కోట్ల పబ్లిసిటీ చేసుకోవడానికి పాలకులు పక్కా వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు.