ఏపీలో రైల్వే రూ. 70 వేల కోట్ల పనులు చేపడుతోంది. కానీ ప్రస్తుతం అవన్నీ ఆగిపోయాయి. ఎందుకో కేంద్ర రైల్వే మంత్రి పార్లమెంట్‌కు చెప్పారు. కేవలం రాష్ట్రం తరపున ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ పనులన్నీ ఆపేశారట. అందుకే ఇక ముందు ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 70వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయని కానీ అవన్నీ ఆగిపోయాయన్నారు.
ఏపీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ చేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి సహకరించేలా చేస్తే… ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వరితగతిన పూర్తి అవుతాయని మంత్రి వివరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఏపీ తన వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉందని అవి ఇస్తే.. రూ. 70 వేల కోట్ల విలువైన పనులు జరుగుతాయన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరీనే ప్రశ్న అడిగి మరీ ఈ విషయాన్ని బయట పెట్టించడం చర్చనీయాంశంగా మారింది.