ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. రెండు వందల కోట్లు పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో రూ. పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం జగన్ తన ప్రారంభ ప్రసంగంలోనే చెప్పారు. మామూలుగా అయితే సదస్సు పూర్తయిన తర్వాత ఎవరెవరు ఎంవోయూలు చేసుకున్నారో లెక్కలేసుకుని చెబుతారు. కానీ ముందుగానే సీఎం జగన్ రూ. పదమూడు లక్షల కోట్లని ప్రకటించేశారు. సీఎం జగన్ ప్రసంగం అయినా కొద్ది సేపటికే మీడియా విభాగం.. రూ. ఏడున్నర లక్షల కోట్ల ఎంవోయూలతో ఓ పత్రం విడుదల చేసింది. వాటి ప్రకారం ఏఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయంటే..
కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు లక్షల ముఫ్ఫై ఐదు వేల కోట్లు పెట్టుబడులు ..77వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ఎంవోయూ చేసుకుందని ప్రభుత్వం చెబుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉన్నఈ సంస్థకు ఉన్న ఉద్యోగులు పదిహేను వేలు. కానీ ఇప్పుడు ఏపీలోనే 77వేల ఉద్యోగాలిస్తామని చెబుతోంది. ఇక రెండో స్థానంలో ఉన్న యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీ లక్షా ఇరవై వేల కోట్లు పెట్టుబడుల్ని ప్రకటించింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ కనీసం ముఫ్పై వేల కోట్లు కూడా లేదు కానీ నాలుగు రెట్లు ఎక్కువ పెట్టుబడిని ప్రకటించేసింది. మూడో స్థానంలో ఉన్న రెన్యూ పవర్.. రెండున్నర వేలు తక్కువ లక్ష కోట్లను పెట్టుబడిగా ప్రకటించేసింది. పదహారున్నరవేల ఉద్యోగాలిస్తామని చెప్పింది.కానీ ఈ కంపెనీ ఆర్థిక స్థితి చూస్తే.. కనీసం లక్ష కోట్లలో ఓ పది శాతం అయినా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. ఈ కంపెనీకి ఇప్పటికి ఉన్న ఉద్యోగులు పదమూడు వందలు మాత్రమే.
ఇక ఇండోసోల్ అనే కంపెనీ ఏడాది కిందట పెట్టారు. రూ. పది లక్షల పెట్టుబడితో. ఇప్పుడు ఏకంగా 76వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించేసింది. ఇక హచ్ వెంచర్స్ అనేసంస్థ రూ. యాభై వేల కోట్ల ఎంవోయూ చేసుకున్నట్లుగా ప్రభుత్వం చెప్పింది. ఈ సంస్థ పెయిడప్ క్యాపిటల్ ఇరవై ఐదు కోట్లు మాత్రమే. ఇక అందరికీ తెలిసిన గ్రీన్ కో 47,600 కోట్లు ప్రకటించింది. ఎక్కడ పెడుతుందో మరి. ఇక అదానీ ఖాతాలో ఇరవై ఒక్క వేలు.. ఎవరికీ తెలియని అవడా, ఎకోరెన్, మొండాలెజ్ అనే కంపెనీలు కూడా వేల కోట్లే లెక్క చెప్పాయి.
ఇవన్నీ ఏమోకానీ ఏపీలో నయా పెత్తందారు సంస్థగా ఉన్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కూడా 8855 కోట్లను ప్రకటించేసింది. ఈ సంస్థ తయారు చేసిన ట్రాన్స్ ఫార్మర్లను డబుల్ రేట్లను ఇష్టారీతీన కొనుగోలు చేస్తూ.. వేల కోట్ల ట్రాన్స్ కో ధనాన్ని కట్టబెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ.. ప్రభుత్వం ఆ సంస్థకు ప్రజా ధనాన్ని ఇస్తే.. వాటినే పెట్టుబడిగా పెడుతుందేమో తెలియాల్సి ఉంది.
ప్రభుత్వం మధ్యాహ్నం వరకూ చూపించిన చెప్పిన పెట్టుబడుల్లో అత్యధికం గ్రీన్ ఎనర్జీ రంగంలోనివే. ఇందులో పెట్టుబడులు కార్యరూపం దాల్చడం.. ఐదు శాతం కూడా ఉండదు. గతంలో ఇలాంటి గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఏపీలో ఎలాంటి పరిస్థితి ఎదురయిందో అందరికీ తెలుసు. శనివారం కూడా ఎంవోయూలు జరగనున్నాయి. ఇలాంటి వేల కోట్ల కబుర్లు ఇంకా ఎన్ని చెబుతారో వేచి చూడాల్సి ఉంది.