రాజధాని నిర్మాణంలో ప్రధాన బాధ్యతలు నిర్వహించవలసి వున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ గిరిధర్ పెద్దగా పనిలేని అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి నారాయణ ల ఆలోచనలపై గిరిధర్ కు భిన్నాభిప్రాయాలు వున్నాయని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ బృందం రాజమండ్రిలో ముఖ్యమంత్రిక సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను అందచేసినపుడు అత్యంత కీలకమైన ఈ అధికారి లేకపోవడాన్నబట్టే గిరిధర్ ఈ పోస్టులో ఆట్టేకాలం వుండరని పసిగట్టేశారు. అనుకున్నట్టుగానే పుష్కరాలు ముగియగానే ఆయన ఒక మారుమూల పోస్టుకు బదిలీ అయిపోయారు. ఈయనకు ముందు ఈస్ధానంలో వున్న సాంబశివరావు కూడా టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. మంత్రి నారాయణకూ ఆయనకూ కుదరకపోవడమే ఆబదిలీకి మూలమని చెబుతున్నారు.
ఇక్కడ నారాయణ వేరు ముఖ్యమంత్రి వేరు కాదు. విద్యావ్యాపారంతో తప్ప ప్రజాజీవనంతో ఏసంబంధంలేని నారాయణకు నేరుగా మంత్రి పదవి కట్టబెట్టారంటే ఆయన చంద్రబాబుకి ఎంతటి విశ్వాసపాత్రుడో అర్ధంచేసుకోవచ్చు. రాజధాని నిర్మాణ సన్నాహాలు మొదలు పుష్కరాల నిర్వహణ వరకూ ముఖ్యమంత్రి స్వయంగా ఫోకస్ పెట్టిన ప్రతీ విషయంలోనూ నారాయణ లేని సందర్భమే లేదు.
రాజధాని నిర్మాణంలో ‘స్విస్ చాలెంజ్’ టెండర్లవల్ల దేశీయులకు అవకాశాలు దాదాపు వుండవు కనుక మరో మార్గం ఆలోచించాలని గిరిధర్ సూచించారని అప్పటినుంచీ ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రీ ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని పక్కన పెట్టేశారని చెబుతున్నారు.
జగన్ కేసులో అధికారులే జైలుకి వెళ్ళినప్పటినుంచి ఐఎఎస్ అధికారులు రాజకీయ నాయకులు మంత్రుల పట్ల నిర్మొహమాటంగా వ్యవహరించడం బాగా పెరిగింది. నాయకుల ఆలోచనలను ప్రొసీజర్ గా మార్చి ఫైలుకి ఎక్కించేది అధికారులే కనుక అందులో తప్పులకు బాధ్యత వారిదే కనుక గిరిధర్ మొదటినుంచీ ‘రాజధాని వ్యవహారాలకు దూరంగా’ వుంటున్నారు. సీడ్ కాపిటల్ మాస్టర్ ప్లాన్ స్వీకరణ లో ఆయన లేకపోవడమే ఇందుకు తార్కాణం.
గిరిధర్ స్ధానంలో నమ్మకమైన లేదా వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయ్యే అధికారికోసం ప్రభుత్వం అన్వేషణ పూర్తికాలేదు..అందుకే మున్నిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి లేకుండానే రాజధాని నిర్మాణం పై ఇతరశాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సుదీర్ఘమైన మంతనాలు జరిపారు.