రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి భూములు స్వాధీనం చేసుకొనేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషణ్ ఇవ్వడం, ఆ తరువాత పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అభ్యంతరాలు చెప్పడంతో మంత్రి నారాయణ మాట మార్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు భూసేకరణ ఆలోచనని విరమించుకొంటున్నామని చెప్పారు. అందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి మంత్రులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోగా, తాము ధర్నా చేయడం వలననే ప్రభుత్వం వెనకడుగు వేసిందని జగన్ చెప్పుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి అవేవీ కారణాలు కావని ఇప్పుడు స్పష్టం అవుతోంది.
ఇదివరకు యూపియే ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన సవరణలను కాంగ్రెస్ పార్టీతో సహా పార్లమెంటులో అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వరుసగా మూడు సార్లు ఆర్డినెన్స్ జారీ చేసింది. మొన్న జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జరగనీయకుండా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు అడ్డుకోవడంతో మోడీ ప్రభుత్వం సవరించిన ఆ భూసేకరణ బిల్లును (అంతకు ముందు లోక్ సభలో ఆమోదింపజేసుకొంది) రాజ్యసభలో ఆమోదింపజేసుకోలేకపోయింది. రాజ్యాంగ ప్రకారం ఏదయినా ఒక ప్రయోజనం కొరకు వరుసగా మూడుసార్లు కంటే ఆర్డినెన్స్ జారీ చేయడానికి వీలులేదు. మోడీ ప్రభుత్వం వరుసగా మూడవసారి జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు సోమవారంతో ముగుస్తుంది. అంటే నేటితో ముగిసింది. కనుక మళ్ళీ దానిపై మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం లేదు.
దానిని ఇంతటితో పక్కన పెడుతున్నట్లు ఇటీవల ‘మన్ కి బాత్’ అనే రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు. అంటే 2013లో యూపీయే ప్రభుత్వం తయారుచేసిన భూసేకరణ చట్టం నేటి నుండి మళ్ళీ అమలులోకి వచ్చిందన్న మాట! ఆ చట్ట ప్రకారం రైతుల అనుమతి లేనిదే బలవంతంగా భూసేకరణ చేయడానికి వీలులేదు. భూసేకరణ చేయదలిస్తే అందుకు రైతు అనుమతి తప్పనిసరి. అంతే కాదు రైతుకు ఆర్ధిక, సామాజిక భద్రతను కల్పించే నిబంధనలు అందులో చాలా ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం రైతుల నుండి భూమిని తీసుకోవాలంటే ప్రభుత్వం చాలా భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రైతుకి, అతనిపై ఆధారపడున్న కుటుంబ సభ్యుల భవిష్యత్ కి పూర్తి భద్రత కల్పించే ఉపాది, ఆదాయం, పునరావాసం, భారీ నష్ట పరిహారం వంటి అనేక హామీలను వ్రాత పూర్వకంగా ఇవ్వవలసి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే 2013 భూసేకరణ చట్టం రైతన్నకి పటిష్టమయిన కవచం వంటిది. దాని రక్షణలో ఉన్న రైతుల భూములు ఏ చట్టం ప్రయోగించినా స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. అందుకు ప్రభుత్వం చాలా వ్యయప్రయాసలకు సిద్దపడాలి.
రైతు తానంతట తానుగా భూమిని ఇచ్చేందుకు సిద్దపడినా అతనికి ఆ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. చిరకాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతల ఆత్మహత్యలని నివారించలేకపోయినా రైతన్నకు ఈ భూసేకరణ చట్టం ద్వారా పూర్తి భద్రత కల్పించింది. బహుశః ఈ కారణంగానే మంత్రి నారాయణ భూసేకరణపై మాట మార్చినట్లు స్పష్టం అవుతోందిప్పుడు. కానీ ఈ తెర వెనుక స్టోరీ అంతా బయటకు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూచన మేరకు భూసేకరణ ఆలోచనని విరమించుకొంటున్నట్లు చెప్పుకొంటే, అది తమ గొప్పదనమేనని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నారు! రైతన్నలను ఒప్పించి వారు ఇష్టపడిఇస్తేనే భూములు తీసుకొంటామని మంత్రి నారాయణ శాంతి వచనాలు పలుకుతున్నారు. కానీ అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.