కరోనా వేవ్ వచ్చిన ప్రతీ సారి స్కూళ్ల పంచాయతీ తెర మీదకు వస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం స్కూళ్లను మూసేది లేదని చెబుతుంది. విపక్షాలు.. పంతానికి పోయి విద్యార్థుల ప్రాణాలను బలి పెడతారా అని విమర్శలు చేయడం సహజం అయిపోయింది. దేశంలో దాదాపుగా పన్నెండు రాష్ట్రాలు కరోనా కారణంగా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించాయి. తెలంగాణ కూడా ఆ జాబితాలో ఉంది.కానీ ఏపీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూళ్లకు సెలవులు ఇచ్చేది లేదని చెప్పేసింది. క్లాసులు సంక్రాంతి సెలవుల తర్వాత పునం ప్రారంభమయ్యాయి.
అయితే ఇప్పుడు ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్కూళ్లకు తక్షణం సెలవులు ప్రకటించాలని.. ఆన్లైన్ తరగతులు పెట్టాలని కోరుతున్నాయి. నారా లోకేష్, మాజీ సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని ఇలాగే డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని .. స్కూళ్లకు సెలవులు ఇవ్వలేమని చెబుతోంది. కరోనా సోకకుడా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం విద్యా సంవత్సరం వేస్ట్ పోతుందేమో… పిల్లల చదువులు కొండెక్కుతాయేమో అని ఆందోళన చెందుతోంది. విపక్షాలకు మాత్రం అదేమీ పట్టడం లేదు.
అయితే ప్రభుత్వంపై విమర్శలు రావడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. కరోనా పెరిగిపోతోందని.. అన్ని రకాల వ్యాపారాలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. మంగళవారం నుంచి ధియేటర్లు.. ఫంక్షన్ హాళ్లు.. మాల్స్ … ఫంక్షన్లు ఏవైనా సగం కెపాసిటీతోనే ఉండాలి. సగం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఇచ్చారు. అన్ని ఆంక్షలు పెట్టినప్పుడు స్కూలు పిల్లలకు మాత్రమే ఎందుకు పూర్తి స్థాయి హాజరును బలవంతపెడుతున్నారని అడుగుతున్నారు. ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ప్రభుత్వం అందరికీ ఒకే రకమైన నిబంధనలు విధించకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కారణంగా స్కూళ్లపై తాను తీసుకున్న నిర్ణయాన్నీ గట్టిగా సమర్థించుకోలేకపోతోంది.