పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తర్వాత అయినా సరే నిర్వహించి తీరుతామని ఏపీ సర్కార్ మరోసారి ప్రకటించింది. మంత్రి ఆదిమూలపు సురేష్.. ఈ ప్రకటన చేసి.. చాలా మందిని ఆశ్చర్య పరిచారు. ఎందుకంటే.. ఏపీ సర్కార్ ఇంత వరకూ టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించలేదు.. రద్దు చేయలేదు. కానీ..ప్రధానమంత్రి కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుండి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. సమీక్షలు నిర్వహించి .. పరీక్షలు పెట్టాలా వద్దా డిసైడ్ చేస్తున్నారు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను మొదట్లోనే రద్దు చేశారు. పన్నెండో తరగతి పరీక్షలను ఇటీవల రద్దు చేశారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం ఇంత వరకూ.. ఎలాంటి పరీక్షలను రద్దు చేయలేదు.
ఇప్పటికే జూన్ వచ్చేసింది. సాధారణంగా అయితే… ఈ పాటికి విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూన్ చివరి వరకూ ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించేసింది. కరోనా తగ్గితే పరీక్షలు పెడతాం అంటోంది. అంటే.. జరిగితే.. జూలైలోనే. పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించేసరికి జూలై పూర్తి అయిపోతుంది. అంటే ఆగస్టు వస్తుంది. అప్పుడు ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలి. ఈ సమస్యలన్నింటినీ ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. తాము పరీక్షలు పెట్టి తీరుతామని టెన్త్ విద్యార్థులు చదువుకుంటూనే ఉండాలని హుకూం జారీ చేశారు.
పదో తరగతి పరీక్షలపై ఇతర రాష్ట్రాలు తేల్చేశాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను సీబీఎస్ఈ కూడా ఎప్పుడో రద్దు చేసింది. పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా జీపీఏలు ప్రకటించేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్ ఆన్ లైన్ క్లాసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ ప్రారంభం అయింది. పరీక్షలు రాయకపోతే విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలంటూ ఏపీ సర్కార్ వాదనలు వినిపిస్తోంది. కానీ ఏ రాష్ట్రంలోనూ టెన్త్ పరీక్షలు జరగడం లేదు. చివరికి సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేశారు. సాక్షాత్తూ మోడీనే పరీక్షల కన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమంటూంటే.. ఏపీ సర్కార్ మాత్రం.. మాకంటే ఎక్కువ ఎవరికి తెలుసని ఎదురు ప్రశ్నిస్తూ.. పరీక్షలకు సిద్ధమవుతోంది.