ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజల్ను ఎలా వెర్రివాళ్లను చేస్తుందో ఇదో చక్కని ఉదాహరణ. విదేశీ విద్యా దీవెన పథకం కింద లబ్దిదారులకు కౌన్సెలింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ మొత్తంగా వచ్చిన దరఖాస్తులు ఐదు వందలే. అందులో ఎస్సీ ఎస్టీలు ముఫ్పై మంది కూడా లేదు. ఎస్సీలయితే ఒక్కరే ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు. ఇతర దేశాల్లో చదువుకోవాలంటే… టాప్ 200 కాలేజీల్లో సీట్లు తెచ్చుకుని ఉండాలని నిబంధన పెట్టారు. అలా అయితేనే ఫీజులు చెల్లిస్తామన్నారు. దీంతో అందరూ ఎలిమినేట్ అయిపోయారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ , బీసీ వర్గాల్లోని పేద పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి అర్హత పొందితే ప్రభుత్వమే ఫీజులు చెల్లించేది. దాదాపుగా రూ. పది లక్షల వరకూ ఇలా సాయం చేసేవారు. ఈ కారణంగా పేదలు విదేశీ విద్యను అందుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సాయాన్ని నిలిపివేసింది. దీంతో చదువు మధ్యలో ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే మేనిఫెస్టోలో ఉండటంతో మళ్లీ ప్రారంభించారు. కానీ నిబంధనలు మార్చేశారు. ఎవరికీ సాయం అందకుండా చేశారు.
టాప్ 200 యూనివర్శిటీలు లేదా కాలేజీల్లో సీటు తెచ్చుకోవాలంటే అత్యున్నత స్థాయి విద్య అందాలి. అలా పేదలకు ఎక్కడ అందుతుంది . ఇతర దేశాల్లో ఉన్న అత్యుత్తమ కాలేజీలకు ర్యాంకులు లేకపోయినప్పటికీ మంచి ప్రమాణాలతో విద్యనుఅందిస్తారు. ఉద్యోగాలొస్తాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని ప్రచారానికి వాడుకుంటోంది. ఈ పథకం పేరుతో పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనలు ఇచ్చి కోట్లు ఖర్చు చేస్తుంది కానీ.. లబ్దిదారుల విషయంలో మాత్రం మహా అయితే నాలుగైదు వందల మందికి పరిమితం చేసే అవకాశం ఉంది.