అమరావతి రాజధాని కాదంటున్నారు., విశాఖే ఏకైక రాజధాని అంటున్నారు. అమరావతి స్మశానం అన్న దగ్గర్నుంచి ప్రారంభించి.. కుల రాజధాని అనే దాకా ఎన్నెన్ని మాటలనాలో అన్నారు. అమరావతిని దాదాపుగా చంపేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ… ఆ నిర్జీవ ప్రాంతం మీదే చిల్లర ఏరుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఆలోచించడం లేదు. భూముల్ని అమ్మకానికి పెట్టేసింది. 14 ఎకరాలను ఈ వేలం వేయడానికి నిర్ణయించుకుంది. ఎకరాల లెక్కల అమ్మడానికి ప్రయత్నించడమే కాకుండా.. దాని ధరను ఐదు కోట్ల 41 లక్షలుగా నిర్ణయించింది. సీడ్ యాక్సెస్ రహదారి పక్కనే ఉన్న ఈ భూములు అత్యంత విలువైనవి.
నిజానికి అమరావతి భూముల్ని అమ్మడాన్ని హైకోర్టు నిరోధించింది. అయినా సరే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తూ అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రైతులకు ఇచ్చి ఒక్క హామీని నెరవేర్చకుండా .. వారిని నానా తిప్పలు పెడుతూ.. ఇప్పుడు వారి భూముల్ని అడ్డగోలుగా అమ్మడానికి ప్రయత్నిస్తోంది. ఈ భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. రైతుల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రక్రియ అని అనుమానిస్తున్నారు. భూముల కొనుగోలు, అమ్మకాలు న్యాయపరిధిలో ఉండగా ఎలా అమ్ముతారనే ప్రశ్నలు వస్తున్నా పట్టించుకోవడం లేదు.
అమరావతిలో విలువైన భూముల్ని ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు… తమ వ్యాపారాలు పెట్టాలనుకుంటే… డబ్బులు కట్టించుకుని ఇస్తారు. గత ప్రభుత్వం ఇలా చేసిన కేటాయింపుల్ని రద్దు చేసిన ప్రభుత్వం వాటిని ఎవరు వస్తే వారికి అమ్మడానికి రెడీ చేసింది. గతంలో నవులూరులో సీఆర్డీఏ లే ఔట్లో స్థలాలు వేలం వేస్తే ఒక్కరు కూడా మందుకు వచ్చి ప్లాట్లు కొనలేదు. ఈ సారి బినామీల్ని దించి భూముల్ని కైవసం చేసుకునే ప్లాన్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.