ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ కులాన్నీ వదలకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. తాజాగా.. రెడ్డి, కమ్మ, క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఒక్కో కులానికి ఒక్కో కారణం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ఓసీగా రెడ్డి కమ్యూనిటీ ఉందని.. వ్యవసాయ ఆదాయంపైనే ఈ కమ్యూనిటీ జీవిస్తుందని…కానీ రుతుపవనాలు సకాలంలో రాకపోవటం, వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రెడ్డి కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, దారుణ దారిద్ర్యాన్ని అనుభవిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది క్రమంగా ఆర్థిక అసమానతలకు దారితీయటంతోపాటు వారిలో ఆందోళనకు కారణమవుతుందని అందుకే.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. రెడ్లకు లాగే.. కమ్మలకు కూడా… వ్యవసాయమే కారణంగా చూపించింది. ఏపీలో వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారని.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని… తమ పిల్లలకు విద్య కోసం అప్పులు చేయటం వల్ల సమాజంలో ఇతర కులాలకు, వీరికి మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే క్షత్రియ, సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తమ పిల్లల విద్యకోసం క్షత్రియ కులంలో భారీగా ఖర్చు చేస్తున్నారు, తద్వారా అప్పుల పాలవుతున్నారని.. దీనివల్ల సమాజంలో వారికి, ఇతరులకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం ఆవేదనతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
ఈ కార్పొరేషన్లన్నీ పేరుకే కార్పొరేషన్లు. ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మిగతా బీసీ కార్పొరేషన్లలాగే ఇవి ఉంటాయి. అంటే వీటికి… ఎలాంటి నిధులు కేటాయించే అవకాశం లేదు. కార్యాలయాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ.. చైర్మన్.. డైరక్టర్ల పోస్టులు.. తమ పార్టీ వారితో భర్తీ చేసుకుంటారు. అయితే అన్ని కార్పొరేషన్ల లాగే… ప్రభుత్వ పథకాల కింద… ఆయా వర్గాలకు ఇస్తున్న నగదును అంటే.. అమ్మఒడి, రైతు భరోసా వంటి నగదు బదిలీ పథకాల కింద.. ఈ వర్గాలకు ఎంత నగదు బదిలీ చేస్తున్నారో.. అదే కార్పొరేషన్ల కింద లెక్క చూపిస్తారు. ఇంత మాత్రం దానికే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు.